DSC Candidates Protest: డీఎస్సీ అభ్యర్థుల దండయాత్ర
జగన్‌కు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరిక;
జగన్ సర్కార్ నిరుద్యోగులను నిలువునా ముంచిందంటూ DSC అభ్యర్థులు కదం తొక్కారు. దగా DSC మాకొద్దు మెగా DSC కావాలంటూ గళమెత్తారు. చాలా జిల్లాల్లో సున్నా పోస్టులతో DSC ఇచ్చేందుకు సిద్ధమైన జగన్‌కు రానున్న ఎన్నికల్లో అదే సంఖ్య ఇచ్చి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జగన్‌ది రాజకీయ సిద్ధం అయితే.... తమది DSC యుద్ధమంటూ హోరెత్తించారు. పాదయాత్రలో 23వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి... ఎన్నికలకు ముందు ఆరు వేల వంద పోస్టుల భర్తీకే ఆమోదం తెలపడంపై కన్నెర్ర చేశారు.
మెగా DSC డిమాండ్‌తో విజయనగరం కోట జంక్షన్‌లో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. DSC అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ మానవహారం చేశారు. మెగా డీఎస్సీ ముద్దు... జగనన్న వద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. వీరికి తెలుగు యువత, నిరుద్యోగ జేఏసీ నేతలు మద్దతు తెలిపారు. డీఎస్సీ అభ్యర్థుల నిరసనతో భారీగా పోలీసులు మోహరించారు. ఏళ్ల తరబడి కోచింగ్ కేంద్రాలలో అర్ధాకలితో మెగా డీఎస్సీ కోసం ఎదురు చూశామని నిరుద్యోగుల గోడు వెళ్లబోసుకున్నారు.
అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై ఎండలో కుర్చీలో కూర్చొని చదువుతూ నిరుద్యోగులు నిరసన తెలిపారు. ఏటా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ మాట తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఇస్తామంటే బటన్ నొక్కి గెలిపించామని అదే బటన్ నొక్కి ఈసారి ఇంటికి పంపుతామని హెచ్చరించారు. తమపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను జగన్ ప్రభుత్వం వమ్ముచేసిందని మండిపడ్డారు.
ఎన్నికల వేళలో యువతను మళ్లీ మోసం చేసేందుకే మినీ డీఎస్సీ ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంటూ నిరుద్యోగులు మండిపడ్డారు. అవనిగడ్డలో డీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చారు. ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వివరించేందుకు వచ్చిన అభ్యర్థులను నాగబాబు కలిశారు. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో మెగా డీఎస్సీ చేర్చాలని నాగబాబుకు విన్నవించారు...
ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ DSC అభ్యర్థులు భారీ నిరసన ర్యాలీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. నిరుద్యోగుల ర్యాలీని అడుగడుగున పోలీసులు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేశారు. పోలీసులకు, DSC అభ్యర్థులకు మధ్య వాగ్వావాదం జరిగింది. 23వేల పోస్టులతో మెగా DSC ఇవ్వాలంటూ నిరుద్యోగుల డిమాండ్ చేశారు.