Editorial: "ఓవరాక్షన్ మంత్రి ఛాప్టర్ క్లోజ్...?"

రోజురోజుకు పడిపోతున్న అమర్నాథ్ గ్రాఫ్; అనవసర అత్యుత్సాహం తప్ప విషయం లేదనే టాక్; పవన్ ను విమర్శించడానికే మంత్రి శాఖా? మూసుకుపోయిన అనకాపల్లి దారులు; పక్క నియోజకవర్గాల్లోనూ పోటీకి నో ఛాన్స్ ; ఓవరాక్షన్ మంత్రి ఛాప్టర్ క్లోజ్ అని టాక్.....

Update: 2023-02-06 12:22 GMT

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ మంత్రి అమర్నాథ్.. రచ్చ మీద ఫోకస్ పెట్టడంతో ఇంట ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికొస్తే మొదట్నుంచీ అధినేతకు విధేయుడిగా ఉన్న వారిలో గుడివాడ అమర్నాధ్ ముందు వరుసలో ఉంటారు. దీంతో అధిష్టానం ఎమ్మెల్యే అయిన తర్వాత అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించింది. మంత్రిగా అవంతి ఉన్న సమయంలోనూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే పని అమర్నాధ్ నిర్వహించేవారు. అది మొదలు ఆది నుంచి అనకాపల్లికి అమర్నాధ్ దూరమయ్యారు.

సెకండ్ టర్మ్ లో మంత్రి అయిన అమర్నాధ్ కు కౌంటర్ మీటింగ్ లు మరింత పెరిగాయి. దీంతో నియోజకవర్గ ప్రజలకు మరింత దూరమయ్యారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. సొంతపార్టీ నేతలే ఈ టాక్ ని పెంచి పోషించారన్న గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. దానికి తోడు అధిష్టానం అప్పగించిన దానికి అమర్నాధ్ అత్యుత్సాహం జోడించడంతో సొంత సామాజిక వర్గంలో మరింత బ్యాడ్ అయ్యారన్నది ఓపెన్ సీక్రెట్. గతంలో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో వ్యవహారంలో జరిగిన రచ్చ అమర్నాధ్ ని ఆ సామాజిక వర్గంలో దోషిని చేసింది.

ఇక సెగ్మెంట్ లో వైసీపీ నేతలు ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతారని సొంత పార్టీ శ్రేణులే మాట్లాడుకుంటున్నారు. మూడు దశాబ్దాలుగా చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు, అతని కుమారుడు రత్నాకర్ లు అమర్నాధ్ తో ఎప్పుడూ అంటీముట్టనట్లే ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా సీనియర్ దాడి వీరభద్రరావు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు. దాడి అండ్ కో కు ఎంపీ సత్యవతి వర్గం తోడవ్వడంతో అమర్నాధ్ కు ఇంటిపోరు తప్పడం లేదు. ప్రతిపక్షాలపై తన వాక్చాతుర్యంతో అమర్నాధ్ దాడి చేస్తుంటే, నియోజకవర్గంలో సొంతపార్టీ సీనియర్లు అమర్నాధ్ పై బాణం ఎక్కుపెట్టడం పార్టీ కీలక నేతలకు తలనొప్పిగా మారిందనేది వాస్తవం.

వైసీపీ ప్రభుత్వ నిర్వాకం.. అమర్నాధ్ అలసత్వం.. ప్రత్యర్థుల పోరాటం.. వీటికి తోడు భూ వివాదాలు. వెరసి అనకాపల్లిలో అమర్నాధ్ పని అయిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో అమర్నాధ్ అనకాపల్లిలో పోటీ చేయరని సొంతపార్టీ శ్రేణులే చెవులు కోరుకుంటున్నాయి. పక్కనే ఉన్న ఎలమంచలిలో అమర్నాధ్ పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఎలమంచలి టికెట్ అతని కొడుకుకు వచ్చేలా పావులు కదుపుతున్నారు. ఇదే సమయంలో అమర్నాధ్ ఎలమంచలిలో పోటీకొస్తారని తెలియడంతో కన్నబాబు రాజు అలర్ట్ అయ్యారు. తానూ, తన కొడుకు కాకుండా బయట్నుంచి ఎవరొచ్చినా ఇక్కడ వైసీపీ ఓటమి ఖాయమని పరోక్షంగా అమర్నాధ్ ని ఉద్దేశించి బాహాటంగా వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీలో పెద్ద దుమారమే రేపింది.

అనకాపల్లి ద్వారాలు కాంప్లిట్ గా క్లోజ్ అయ్యాయి. ఇక ఎలమంచలిలో కన్నబాబు రాజు రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఇక మిగిలింది పెందుర్తి. అక్కడ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అధీప్ రాజ్, జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ ల మధ్య టిక్కెట్ వార్ నడుస్తోంది. ఈ సమయంలో గుడివాడ అమర్నాథ్ అక్కడికి వెళ్లడం అంత మంచిది కాదని సొంత వర్గీయులు హితబోధ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అప్పుడప్పుడు గాజువాక పేరు విన్పిస్తున్నా అక్కడ బలమైన ప్రత్యర్థులు బరిలో దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్న నేపథ్యంలో అమర్నాధ్ అంత సాహసం చేస్తారా.. అన్న ప్రశ్న విన్పిస్తోంది. ఈ రకంగా అత్యుత్సాహపు మంత్రి అమర్నాథ్ పని అయిపోయినట్టేనన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఎన్నికల నాటికి సారు ఓవరాక్షన్ ఇటు పర్సనల్ గా, అటు పార్టీని ఇంకెంత డ్యామేజ్ చేస్తుందో.

Tags:    

Similar News