ఏపీలో పెట్టుబడుల జాతరకు సర్వం సిద్ధం అయింది. రేపు, ఎల్లుండి విశాఖలో సీఐఐ సదస్సు జరగబోతోంది. దేశ, విదేశాల్లో ప్రముఖ కంపెనీలను ఏపీకి తీసుకురావడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే చంద్రబాబు దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడి పారిశ్రామిక వేత్తలను ఏపీ సీఐఐ సదస్సుకు ఆహ్వానించారు. అలాగే లోకేష్ ఆస్ట్రేలియా వెళ్లి అక్కడున్న కంపెనీలను ఈ సదస్సులో భాగస్వామ్యం కావాలని కోరారు. వారంతా వచ్చేందుకు ఇప్పటికే టైమ్ కేటాయించారు. ఇప్పటికే చాలా కంపెనీల ప్రతినిధులు విశాఖలో అడుగు పెడుతున్నారు. ఈ సదస్సులో 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 400లకు పైగా ఒప్పందాలు జరగనున్నాయి.
48 కీలక సెషన్స్, బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్, ఏపీ పెవిలియన్, హ్యాక్ థాన్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, ఇతర అధికారులు విశాఖలో అన్ని ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతున్నారు. ఈ సదస్సుకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు వరుస మీటింగులు పెడుతారు. నోటావెట్ హోటల్ ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్ లో చంద్రబాబు రేపు ఉదయం పాల్గొంటారు. వైజాగ్ ఎకనామిక్ రీజియన్ పై జరిగే సమావేశానికి కూడా చంద్రబాబు హాజరు అవుతారు. తైవాన్, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో జరిగే సమావేశానికి కూడా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చీఫ్ గెస్ట్ గా వస్తారు. అలాగే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా వస్తారు. చివరగా నెట్ వర్క్ డిన్నర్ లో పాల్గొని అతిథులకు ఆతిథ్యం ఇస్తారు. ఈ సమావేశాల్లో విశాఖతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కేవలం ఒక ప్రాంతానికే ప్రాముఖ్యత ఇవ్వకుండా దాదాపు అన్ని ప్రాంతాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. అందులో భాగంగా ఏపీకి ఉన్న ప్రాముఖ్యత, ఇతర ఫెసిలిటీలను వివరించబోతున్నారు. వైసీపీ హయాంలో జీరోకు పడిపోయిన పెట్టుబడులు.. ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి.