Devaragattu : దేవరగట్టులో కర్రల సమరానికి అంతా రెడీ..
Devaragattu : కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది;
Devaragattu : కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ అర్ధరాత్రి జరిగే కర్రల సమరానికి భక్తులు సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మరోవైపు కర్రల సమరానికి అడ్డకట్ట వేసేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
హోళగుంద మండలం దేవరగట్టు కొండపైన వెలసిన మాల మల్లేశ్వర స్వామి అమ్మవార్ల కల్యాణం ప్రతి ఏటా విజయదశమి రోజు రాత్రి జరుగుతుంది. కల్యాణం అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను భక్తులు కిందకు తీసుకొస్తారు. ఈ క్రమంలోనే నెరణికి, నెరణికితాండ, కొత్త పేట, సులువాయి గ్రామస్తులు అర్ధరాత్రి కర్రలు చేత పట్టి... అగ్గి దివిటీలు తిప్పుకుంటూ వేల సంఖ్యలో తరలివస్తారు. ఈ సమయంలో కర్రలన్నీ పైకి ఎత్తడం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొట్లాటలు, ఘర్షణలు చోటు చేసుకుంటాయి. కర్రలు తగిలి.. ప్రతిఏటా అనేక మంది తలలు పగులుతున్నాయి.
ఈ మూడాచారాన్ని ఆపాలని గతంలో మానవహక్కుల చట్టం అధికారులను ఆదేశించింది. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం.. దేవరగట్టులో జరిగే కర్రల సమరాన్ని ఆపాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ తరతరాల నుంచి వస్తున్న ఆచారాన్ని ఆపలేమని గ్రామస్తులు నిక్కచ్చిగా చెబుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. బైండోవర్ కేసులు పెట్టినా.. దసరా రోజు మాత్రం కర్రల సమరం జరిగే తీరుతున్నది.
మరోవైపు దేవరగట్టు బన్ని ఉత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అవగాహన సదస్సు నిర్వహించారు. త్రాగునీరు, తాత్కాలిక ఆస్పత్రితో పాటు లైటింగ్, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.