వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. ఏపీలో గత ఎన్నికలకు ముందు జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో అరెస్ట్ చేశారా.? లేదా మరో కేసులో వంశీని అదుపులోకి తీసుకున్నారా.? అనే విషయాలపై మరికాసేపట్లో ఏపీ పోలీసులు క్లారిటీ ఇవ్వనున్నారు. ఒకవేళ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఇందులో వల్లభనేని వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. ఈలోపే వంశీ అరెస్టు అవడం ఇప్పుడు కీలకంగా మారింది. 2023 ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగింది.