Farmer Suicide : భూమి పోయిందని రైతు ఆత్మహత్య

Update: 2025-04-04 11:00 GMT

రైతుకు ప్రాణం భూమి... తల్లికి బిడ్డకు ఉన్న సంబంధమే రైతుకు భూమికి ఉంటుందన్నమాట ఎవరూ కాదనలేని సత్యం... తన తండ్రి మిలిటరీ జవాన్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన తరువాత ప్రభుత్వం ఆర్మీ కోటాలో ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్న వెంకటాద్రి..

తన భూమిని బలవంతులు గద్దల్లా తన్నుకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. మిగిలిన భూమైనా తన పేరున ఆన్లైన్ చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ పదేళ్లపాటు తిరిగినా ఫలితం లేకపోవడంతో తన ప్రాణమైన తన భూమి తనకు దక్కలేదని తీవ్ర మనస్థాపానికి గురై.. చెట్టుకు ఉరి వేసుకుని ఉసురు తీసుకున్నాడు. తన ఇద్దరు సంతానం అయిన కొడుకు యువరాజు కూతురు మీనాక్షి బతుకుదెరువు రీత్యా తిరుపతి, రేణిగుంటలో ఉండగా భార్య సరస్వతి భర్త మృతితో ఒంటరిగా మిగిలిపోయింది. ఈ పరిస్థితి అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం పెదవాకపల్లిలో గురువారం జరిగింది.

మాజీ మిలిటరీ జవాను చంద్రగిరి లక్ష్మయ్య ఆర్మీలో పనిచేస్తూ పదవీ విరమణ పొందాడు. తన జీవనానికి ప్రభుత్వం మిలటరీ కోటా లో సర్వే నెంబరు 1051లో 5.51 ఎకరాల భూమిని మంజూరు చేసి దానికి ఏక్సాల్ పట్టా ఇచ్చింది. దీంతో రిటైర్డ్ జవాను లక్ష్మయ్య తన భార్య అలివేలమ్మతో కలిసి తను జీవించి ఉన్నంతకాలం కుమారుడు వెంకటాద్రిని ఆసరాగా చేసుకుని వ్యవసాయం చేసి జీవించేవారు. లక్ష్మయ్య మరణించిన తర్వాత ఆయన భార్య అలివేలమ్మ అదే భూమిలో నివాస గృహం నిర్మించుకుని, వ్యవసాయ బోరు వేసుకుని మూడు దశాబ్దాలుగా జీవనం సాగించి ఆమె కూడా మృతి చెందింది. అనంతరం వెంకటాద్రికి ఆ భూమి వారసత్వంగా వచ్చింది. తనకు హక్కు కలిగిన 5.51 ఎకరాల భూమిలో సుమారు 3.5 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, ఇందులో ఇద్దరు రైతులు రెండు ఎకరాలకు పైగా ఆక్రమించుకుని కంచె వేసుకున్నారు. మిగిలిన భూమిలో కొంత వైఎస్ఆర్ కాలనీ కోసం స్థలాలను కేటాయించారు. దీంతో లక్ష్మయ్య కుమారుడు చంద్రగిరి వెంకటాద్రి ఆక్రమణకు గురైన భూమిని తిరిగి తనకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్కు వారికి స్థానిక రెవెన్యూ అధికారులకు పలుమార్లు అర్జీలు సమర్పించుకున్నారు కానీ ఎవరూ తన సమస్యను పట్టించుకోలేదు. మిగిలిన భూమినైనా ఆన్లైన్ చేయాలని ప్రయత్నించినా ఫలితం రాలేదు. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Tags:    

Similar News