Fishermen problems : గంగపుత్రుల జీవితాల్లో చీకట్లు
కూలి పనులకు వెళ్తున్న మత్స్యకార కుటుంబాలు
మాటలు చెప్పి పూట గడపటంలో జగన్‌కు మరెవరూ సాటిరారు.గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తా....వారి అభ్యున్నతికి బాటలు వేస్తానంటూ చింతపల్లి ఫ్లోటింగ్ జెట్టీ శంకుస్థాపన సమయంలో జగన్ చెప్పుకొచ్చారు. పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికారు. నాడు జగన్ చెప్పిన మాటలతో తమ జీవితాలు మారతాయని మత్స్యకారులు ఆశపడ్డారు. పునాదిరాయి వేసి సంవత్సరం గడిచినా సంబంధిత పనులు అడుగు ముందుకు పడకపోవడంతో నేడు ఆందోళన చెందుతున్నారు. అన్ని వర్గాలతో పాటు తమనూ జగన్ నమ్మించి నట్టేట ముంచారని వాపోతున్నారు.
విజయనగరం జిల్లాలో సుమారు 21.44 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణం వల్ల సుమారు 4వేల మత్స్యకార కుటుంబాల్లోని 20 వేలమందికి మేలు జరుగుతుంది. జిల్లాలో గుర్తింపు పొందిన 711 మోటరైజ్‌డ్ ఫిషింగ్ బోట్లు, 417 సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క చింతపల్లి ప్రాంతంలోనే 487 మోటరైజ్‌డ్ ఫిషింగ్ క్రాప్ట్స్, 361 సంప్రదాయ పిషింగ్ బోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో పూడిమడక తరువాత, చింతపల్లే రెండో పెద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌గా చెప్పొచ్చు. గంగపుత్రుల అభ్యర్థనలతో 6 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ జెట్టీ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. 23.73కోట్లు రూపాయల అంచనాతో గతేడాది మే 3న జగన్ భోగాపురం వద్ద జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం వేసి ఏడాది గడిచినా నిర్మాణ పనులు అడుగు ముందుకు పడకపోవడంతో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
విజయనగరం జిల్లాలో చేపలవేటలో అత్యంత నైపుణ్యం ఉన్న మత్స్యకారులు ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్లినా, విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు కనిపిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో పనిచేస్తున్న బోటు డ్రైవర్లలో సగం మంది విజయనగరం జిల్లాకు చెందినవారే. స్థానికంగా జెట్టీ నిర్మాణంతో వీరంతా తమ ప్రాంతాలకు తిరిగివచ్చే అవకాశం లభిస్తుంది. తద్వారా పురుషులతో పాటు మత్య్సకార మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు రెట్టింపవుతాయి. కానీ చింతపల్లిలో జెట్టీ ఎప్పుడు పూర్తవుతుందోఈ ప్రాంత మత్స్యకారుల బతుకులు ఎప్పుడు బాగుపడతాయో అని మత్స్యకార సంఘం నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
చింతపల్లిలో జెట్టీ నిర్మాణం పూర్తయితే పర్యాటక పరంగానూ ఈ ప్రాంతం ఎంతో అభివృద్ది చెందుతుంది. ఇప్పటికే చింతపల్లి బీచ్ జిల్లాలో ఏకైక సముద్రతీర సందర్శనీయ ప్రాంతంగా ఉంది. చింతపల్లి లైట్ హౌస్ కూడా నిత్యం సందర్శకులను ఆకర్షిస్తుంటుంది. భోగాపురం విమానాశ్రయానికి దగ్గర ప్రాంతం కావడం, జాతీయ రహదారి సమీపంలోనే ఉండటంతో పర్యాటకంగానూ చింతపల్లి బీచ్ అభివృద్ధి చెందుతుందని గంగపుత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.