ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జలగండం వీడటం లేదు. ఆగస్టు నెలాఖరు, సెప్టెంబర్ తొలివారంలో భారీగా కురిన వర్షాలతో ఇబ్బంది పడ్డ ఏపీ ప్రజలకు వాతావరణశాఖ మరో బాంబ్ పేల్చింది. వచ్చే వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందంటూ ప్రకటించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి రాష్ట్రంవైపు కదిలే అవకాశాలు ఉన్నాయంటోంది.
ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో.. ఈ సీజన్‌లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రభావంతో సెప్టెంబరు చివరి వారంలో మళ్లీ వానలు పడతాయంటున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో గోదావరి మరింత ఉద్ధృతంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉత్తరాంధ్రను వణికించిన వాయుగుండం ఒడిశాలో తీరం దాటిన తరువాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. తరువాత వాతావరణం అనుకూలించడంతో మళ్లీ వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రా రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.