Krishna And Godavari Rivers : కృష్ణ, గోదావరి నదులకు మళ్లీ వరద ఉధృతి: దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి నదులకు మరోసారి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సముద్రంలోకి వెళ్లే నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహంపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద 4.11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రానికి ప్రవాహం 4.5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం కూడా పెరుగుతోంది. ఇక్కడ 3.97 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 4 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఈ నెల 28 నాటికి గోదావరి వరద ప్రవాహం గణనీయంగా పెరిగి, దాదాపుగా మొదటి హెచ్చరిక స్థాయి అయిన 9.5-10 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరద ఉదృతి నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా నదీ తీర ప్రాంతాలవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.