కృష్ణానదిలో గంటగంటకు పెరుగుతున్న వరద

Update: 2020-10-17 04:16 GMT

కృష్ణానదిలో వరద గంటగంటకూ పెరుగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు తీవ్రం ఆందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా.. అధికారులు మాత్రం దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయలేదు. అరకొరగా నడుస్తున్న మరబోట్లకు కనీసం డీజిల్‌ కూడా ఇవ్వడం లేదని.. మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద కారణంగా భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. విజయవాడలోని కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, తారకరామనగర్, భూపేష్ గుప్త నగర్ తదితర ప్రాంతాలు ఐదు రోజుల నుంచి జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద నీరు ఇళ్లను ముంచెత్తడంతో బాధితులు కట్టమీద తలదాచుకుంటున్నారు. వరద వచ్చినప్పుడల్లా నరకం అనుభవిస్తున్నామని బాధితులు వాపోతున్నారు.

కృష్ణా పరీవాహక ప్రాంతంలో వస్తున్న భారీ వదరలకు జగ్గయ్యపేట మండలం ముక్త్యల, రావిరాల, వెద్రాద్రి ప్రాంతంలో పంటలు నీట మునిగాయి. రావిరాలలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. దీంతో పశువులు, ధాన్యం, ఇతర సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు గ్రామస్తులు.

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిరప పంట పూర్తిగా దెబ్బతింది. పంట వేసిన 15 రోజులకే వర్షాలు, వరదలు ముంచెత్తడంతో పంట మొత్తం వర్షార్పణం అయింది. పత్తి, కంది, కూరగాయలు, అరటికి అధిక మొత్తంలో నష్టం కలిగింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిదికాదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. మంగళగిరి, తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగింది.


Tags:    

Similar News