ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు YCP అధ్యక్షుడు జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. శైలజానాథ్ వెంట పలువురు అనుచరులు కూడా YCP కండువాకప్పుకున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు శైలజానాథ్.
వైఎస్సార్ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా ఆయన పార్టీలో కొనసాగారు. 2022లో ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు. 2024 ఎన్నికలకు ముందు శైలజానాథ్ తెలుగు దేశంలోకి వెళ్తున్నారని ప్రచారం జరిగినా ఆయన చేరలేదు.