రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తనను ఏ6గా చేర్చడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించింది. పేర్ని నానిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి6కు వాయిదా వేసింది. ఇదే కేసులో ఆయన సతీమణికి కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట గోదామును నిర్మించారు. దీనిని పౌరసరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. ఈ గోదాములో భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసింది పౌరసరఫరాల శాఖ. ఈ రేషన్ నిల్వల్లో అవకతవకలను గుర్తించిన అధికారులు...ఇటీవల గోదాములో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రేషన్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. భారీగా రేషన్ బియ్యం మాయమైనట్లు తనిఖీల్లో నిర్థారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు...గోదాము మేనేజర్ మానస్‌తేజ, పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి, మరో ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మేర లావాదేవీలు జరిగాయని గుర్తించినట్లు తెలుస్తోంది. పేర్ని నాని కుటుంబంలోని పలువురి ఖాతాలకు మానస్ తేజ ఖాతా నుంచి డబ్బులు వెళ్లినట్లు గుర్తించారు.