AP: విజయనగరంలో తీవ్ర విషాదం
ఆడుకుంటూ కారెక్కిన నలుగురు చిన్నారులు...ఊపిరి ఆడక మృతి;
అప్పటివరకు కళ్ల ముందే ఆడుకుంటున్నారు.. సంతోషంగా గెంతులేస్తున్నారు.. అసలే ఆ గ్రామంలో రెండు వివాహాలు, మరో శుభకార్యం. వీటితో ఊరంతా పండగ వాతావరణం. ఏ ఇళ్లు చూసిన బంధుమిత్రులతో కళకళాడుతోంది. ఇలాంటి సందర్భంలో పిల్లల ఆటపాటలు, సరదాలు చెప్పనక్కర్లేదు. ఆ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అలాంటి సరదానే నలుగురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఆడుకుంటూ సరదాగా ఆగి ఉన్న కారులోకి ఆ నలుగురు చిన్నారులు ఎక్కారు. కాసేపటికి కానీ వారికి తెలియలేదు కార్ డోర్ లాక్ పడిందని. లోపల ఉక్కపోయడంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ ప్రమాదం నుంచి బయటపడలేక సహాయం కోసం విలవిలాడుతూ కారులోనే వారు ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా ద్వారపూడిలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఉదయం ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. సరదాగా ఆడుకుంటూ గ్రామ మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో కూర్చునేందుకు వెళ్లి డోర్ వేసుకున్నారు. కారు డోర్ లాక్ పడడంతో ఊపిరాడక మృతి చెందారు. మృతులు కంది మణీశ్వరి, బూర్లె చారుమతి(8), బూర్లె జాశ్రిత(6) వంగి ఉదయ్(8)గా గుర్తించారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఉదయం నుంచి ఊరంతా గాలించారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆగి ఉన్న కారులో వారిని గుర్తించారు. ఈ క్రమంలో కారు అద్దాలు పగలగొట్టి చూడగా నలుగురూ విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే తల్లిందండ్రులు వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మిన్నంటిన బంధుమిత్రుల రోదనలు
నలుగురు చిన్నారులు మరణించడంతో చిన్నారుల తల్లిదండ్రులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. అల్లారముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు ఇక లేరని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. మృతుల్లో బూర్లె చారుమతి(8), బూర్లె జాశ్రిత(6) ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రిలో చిన్నారుల మృతదేహాలకు విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సందర్శించి నివాళులర్పించారు. మృతుల కుటుంబాల ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
నలుగురు చిన్నారులు మరణిచండంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర వేదనకు గురిచేసిందన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హమీ ఇచ్చారు.