ఏపీ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో పడింది. ఇప్పటికే పలు పతకాల ద్వారా ప్రజల అభిమానాన్ని సంపాదించిన ప్రభుత్వం తాజాగా ఆడబిడ్డలకు శుభవార్త చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్త్రీ శక్తి పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నారు. మరో నాలుగు రోజుల్లో పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారిక జీవో విడుదల చేసింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నారు. ప్రజా రవాణా శాఖ ద్వారా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా.. ఆర్డినరీ, పల్లెవెలుగు తో పాటు మెట్రో ఎక్స్ప్రెప్రెస లలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఇప్పటికే రూపొందించారు అధికారులు. మహిళల రద్దీ పెరగనున్న నేపథ్యంలో బస్ స్టాండ్ లలో సదుపాయాలు మెరుగుపరచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకానికి అర్హులైన మహిళా ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చును ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. కాగా తెలంగాణలో ఇప్పటికే ఈ పథకం అమలు అయ్యి విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.