AP: అఖండ గోదావరి దిశగా తొలి అడుగులు
అఖండ గోదావరి ప్రాజెక్టుకు అంకురార్పణ చేసిన కేంద్రమంత్రి.. పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్;
వేదంలా ఘోషించే గోదారమ్మ నగలో మరో కలికితురాయి చేరింది. అమర నాదంలా శోభిల్లే రాజమహేంద్రి చరిత్రలో.. కిరీటాన్ని అలంకరించుకోనుంది. వెయ్యేళ్ల చరిత్రను ఇముడ్చుకొన్న సాంస్కృతిక రాజధానిని ఎప్పటి నుంచో ఊరిస్తున్న ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టు కల సాకరం దిశగా కూటమి ప్రభుత్వం తొలి అడుగు వేసింది. 100 ఏళ్లు సేవలందించిన రైల్వే పాత వంతెన.. రాజమహేంద్రవరం అంటేనే ఠక్కున స్ఫురించే ‘పుష్కరాల రేవు’.. కడియం పూల వనాలు.. నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయాన్ని రూ.100 కోట్లతో కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ శంకుస్థాపన చేశారు.
రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శంకుస్థాపన చేశారు. సైన్స్ కేంద్రం ప్రారంభం, ఫారెస్ట్ అకాడమీ భూమి పూజ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ పురందేశ్వరిలతో కలిసి గజేంద్రసింగ్ షెకావత్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో కేంద్రంతో కలిసి కూటమి ప్రభుత్వం అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టింది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా చారిత్రక నగరం రాజమహేంద్రవరంను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. కేంద్రం నిధులు రూ. 375 కోట్లతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది తీరమని... ఇలాంటి చోట నాగరికత, భాష ఉంటాయని అన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ, బాపు రమణల్లో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ సహా ఎంతో సాహితీవేత్తలు, ప్రముఖులు పుట్టిన ప్రాంతం ఇదని అన్నారు. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని భావించామని. రూ.430 కోట్లతో ఈరోజు మొత్తం 7 ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.
వారసత్వ సాంస్కృతిక గుర్తింపు : కేంద్రమంత్రి
అఖండ గోదావరి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృధి చేస్తాం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజమండ్రిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందదాయకమన్నారు. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా చేస్తామన్నారు. రాజమండ్రిని వారసత్వ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపుకు చర్యలు తీసుకుంటాం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రలు శంకుస్థాపన చేశారు అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడారు. ‘అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం ఆనందదాయకం. ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృధి చేస్తాం. 2035 నాటికి ఏపీలో 30 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా చేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… ‘డబల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకున్నారని... వికసిత భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక భాగం. అమరావతి, పోలవరం ఇలా అన్నింటికీ కేంద్రం సహకారం అందిస్తోందన్నారు.