Godarolla Kitakitalu: 'గోదారోళ్ల కితకితలు'.. ఫేస్‌బుక్‌ పేజ్ క్రియేటర్ ఈవీవీ ఇక లేరు..

Godarolla Kitakitalu: తన మాటలతో, తన వ్యాఖ్యలతో, తన రైటింగ్స్ తో అందర్నీ నవ్వించే ఈవీవీ.. ఈదల వీర వెంకట సత్యన్నారాయణ గుండెపోటుతో మరణించారు..;

Update: 2022-06-03 09:00 GMT

Godarolla Kitakitalu: తన మాటలతో, తన వ్యాఖ్యలతో, తన రైటింగ్స్ తో అందర్నీ నవ్వించే ఈవీవీ.. ఈదల వీర వెంకట సత్యన్నారాయణ గుండెపోటుతో మరణించారు.. గోదారోళ్ల కితకితలు పేరుతో ఫేస్‌బుక్‌ పేజ్ క్రియేట్ చేసి లక్షలాది మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని స్వస్థలం బొమ్మూరులో తుది శ్వాస విడిచారు.

గురువారం రాత్రి 11.30 గంటలకు ఆయనకు గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ఆయన ఊపిరి ఆగిపోయింది. ఈవీవీ మృతిపట్ల ప్రముఖులు, గ్రూప్ సభ్యులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

గోదావరి యాస అన్నా, అక్కడి సంస్కృతి అన్నా ఈవీవీకి చెప్పలేనంత ఇష్టం.. ఆ ఇష్టంతోనే ఫేస్‌బుక్‌ పేజీ క్రియేట్ చేసి సరదా సంభాషణలు అందులో రాసేవారు.. 2016లో గోదారోళ్ల కితకితలు పేరుతో ఈ పేజీని ప్రారంభించారు. గోదావరి యాస, భాష, సంస్కృతి తెలిపే పోస్టులు చేసి ఇతర ప్రాంతాల వారిని కూడా ఆకర్షించారు.

పేజి క్రియేట్ చేసిన ఏడాదిలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ విదేశాల్లోని తెలుగు వారు కూడా అతడి పేజీని లైక్ చేశారు.. దీంతో ఫాలోవర్ల సంఖ్య కూడా లక్షకు చేరుకుంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేసేవారు.. దాదాపు 50 వేల మంది ఈ వన భోజనాలకు హాజరయ్యేవారు. భావి తరాలకు గోదారోళ్ల యాస, భాష తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఫేస్‌బుక్‌ పేజి క్రియేట్ చేసినట్లు చెప్పేవారు.

రచయితగా మధ్య తరగతి ప్రజల జీవన స్థితి గతులను తెలిపే ఆయన రాసిన కథనాలు పలు పత్రికల్లో ప్రచురితమయ్యేవి. పలు షార్ట్ ఫిల్మ్ లను కూడా ఆయన రూపొందించారు. నాగార్జున కథానాయకుడిగా వచ్చిన బంగార్రాజు చిత్రంలో ఈవీవీ నటించారు.

Tags:    

Similar News