Gulab Cyclone AP : ఏపీలో గులాబ్ తుపాన్ భీభత్సం..!
Gulab Cyclone AP : ఉత్తరాంధ్రపై గులాబ్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపించింది. విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసాయి.;
Gulab Cyclone AP :ఉత్తరాంధ్రపై గులాబ్ తుపాన్ తీవ్ర ప్రభావం చూపించింది. విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుపాను ధాటికి సుమారు లక్షన్నర ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరి, మొక్క జొన్న, పత్తి, ఉద్యాన పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. పొలాలన్నీ జలమయ మయ్యాయి.. వంశధార, నాగావళి, వేదావతి, ఇతర చిన్న నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
మరోవైపు ఏపీని వర్షాలు ఇప్పట్లో వదిలా లేవు. ఇప్పటికే గులాబ్ తుఫాను ఉత్తరాంధ్ర సహా మొత్తం ఆరు జిల్లాలను గజగజా వణికించింది. ఆ భయం ఇంకా వీడకముందే ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.