GUNTUR: గుంటూరు మిర్చి యార్డు మరో రికార్డు
రూ. 10 వేల కోట్ల లావాదేవీల మార్క్ నమోదు... రూ. 100 కోట్లు దాటిన మార్కెటింగ్ శాఖ ఆదాయం;
గుంటూరు మిర్చియార్డు మరో మైలు రాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 వేల కోట్ల లావీదేవీల మార్కును నమోదు చేసింది. మిర్చి ఎగుమతులకు అనువుగా ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి రైతులు ఇక్కడకు సరకు తెస్తున్నారు. భారీగా పెరిగిన లావాదేవీలతో... మిర్చియార్డు ద్వారా మార్కెటింగ్ శాఖ ఆదాయం 100కోట్ల రూపాయలు దాటింది.
మిర్చి అమ్మకాలు, కొనుగోళ్లు, ఎగుమతుల్లో గుంటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి మిర్చియార్డుకు వచ్చే సరకు ప్రంపంచంలోని 25కు పైగా దేశాలకు ఎగుమతి అవుతుంది. అందుకే గుంటూరు మిర్చియార్డు అంతర్జాతీయంగా పేరొందింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎక్కువగా మిర్చి పంట ఇక్కడకు వస్తుంది. అలాగే ప్రకాశం, కర్నూలుతో పాటు... తెలంగాణ జిల్లాల నుంచి రైతులు సరుకు తెస్తుంటారు. గత రెండేళ్లుగా కర్ణాటక రైతులు బ్యాడిక రకాల్ని ఇక్కడకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇలా మూడు రాష్ట్రాల నుంచి రైతులు వస్తుండటంతో భారీగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 10వేల కోట్ల రూపాయల లావాదేవీల మార్కు దాటింది. విదేశాలకు మిర్చి ఎగుమతి చేసే స్థానిక వ్యాపారులతో పాటు గుజరాత్ వ్యాపారులు... కొన్ని కార్పొరేట్ సంస్థలు మిర్చియార్డులో లావాదేవీలు నిర్వహించాయి. చైనా దేశం ఎక్కువగా దిగుమతి చేసుకునే తేజ రకం మిర్చికి ఈ ఏడాది మంచి డిమాండ్ ఉంది. పెరిగిన లావాదేవీలతో గుంటూరు మిర్చియార్డుకు రికార్డు స్థాయిలో 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 94 కోట్ల మేర ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా... అంతకు మించి వసూళ్లు రాబట్టారు. 2021-22లో 80 కోట్లు, 2022-23లో 82 కోట్ల రూపాయల ఆదాయం రాగా... ఈసారి దానికి 20శాతం అధికంగా రాబడి సాధించినట్లు అధికారులు చెబుతున్నారు.
2019, 2020 సంవత్సరాల్లో కరోనా కారణంగా మిర్చియార్డులో క్రయవిక్రయాలు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2020-21లో మొత్తంమీద 93.39 లక్షల బస్తాల విక్రయాలు జరిగాయి. 2021-22 సంవత్సరం నుంచి లావాదేవీలు పెరగటం మొదలైంది. 2022-23లో మిర్చి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2023-24లో ఈ ఒరవడి మరింతగా పుంజుకుంది. ఎగుమతులు బాగానే ఉండటం, కొత్త వ్యాపారులు మార్కెట్లోకి రావటంతో ధరలు పెరిగాయి. ఇవన్నీ రికార్డుస్థాయి లావాదేవీలు నమోదవటానికి కారణమయ్యాయి.