Pawan vs Mudragada: జగన్ కోసమే ముద్రగడ లేఖలు... హరిరామ జోగయ్య ఫైర్
నీకు పవన్ కళ్యాణ్ కి పోలికా ఉందా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు;
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర కాపు నేతల మధ్య పొలిటికల్ హీట్ పెంచుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం రాస్తున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. తాజా ముద్రగడను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి హరిరామజోగయ్య తీవ్ర విమర్శలు చేశారు. పవన్ స్ధాయికి ముద్రగడ సరిపోరని, జగన్ కోసమే ఆయన లేఖలు రాస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నీకు పవన్ కళ్యాణ్ కి పోలికా ఉందా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పత్తిపాడులో ముంద్రగడపై పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ అవసరం లేదని.. ఒక జన సైనికుడిని నిలబెట్టినా గెలుస్తాడన్నారు.
పవన్ కళ్యాణ్ రోడ్డుపైకి వస్తే వేల మంది వస్తారని, అదే పద్మనాభం రోడ్డుపైకి వస్తే పదిమంది కూడా రారని జోగయ్య ఎద్దేవా చేశారు. ముద్రగడ వైసీపీ నేతలు నుండి వచ్చే లేఖలను విడుదల చేస్తున్నాడన్నారు. అనవసర విమర్శలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని ముద్రగడకి హరిరామజోగయ్య సూచించారు. జగన్‌కి లబ్ధి చేకూర్చేందుకే ముద్రగడ పద్మనాభం రెండో లేఖ రాశారని జోగయ్య విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక్క కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసేందుకు పార్టీ పెట్టి ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ రోజురోజుకీ పెరుగుతుందన్నారు. ఆ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రయోజనాల కోసమే ముద్రగడ పద్మనాభం విమర్శలు చేస్తున్నాడన్నారు. వంగవీటి మోహన రంగా హత్య అనంతరం రాష్ట్రంలో ఎంతో మంది కాపులపై ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఆ కేసులు ఎత్తి వేయాలని 18 రోజులు పాటు నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని తానని హరిరామజోగయ్య గుర్తుచేశారు. ఇక కాపుల కోసం ముద్రగడ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.