AP: ఆంధ్రప్రదేశ్‌లో దంచికొట్టిన వాన

కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు... నీటమునిగిన ఆరబెట్టిన మిరప, మొక్కజొన్న పంటలు;

Update: 2024-05-08 01:00 GMT

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. పల్నాడు జిల్లా అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడగా ఆరబెట్టిన మిరప, మొక్కజొన్న పంటలు తడిచిపోయాయి. క్రోసూరు మండలం ఊటుకూరులో పిడుగుపాటుకు పొలం నుంచి ఇంటికి వస్తున్న తల్లీకుమార్తె ప్రాణాలు కోల్పోయారు. కృష్ణాజిల్లా గుడివాడలో గాలివాన బీభత్సం సృష్టించింది.పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. తిరువూరు పరిసర ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం కురిచింది. మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా మామిడి కాయలు నేలరాలాయి. నందిగామలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. విజయవాడలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అమరావతి ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించింది. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి కరెంట్ స్తంభాలు కూలి పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. రాజమహేంద్రవరంలో జోరు వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పార్వతీపురం జిల్లా సాలూరులో మోస్తరు వర్షం కురిసింది.


తెలంగాలో నలుగురి మృతి

అకాల వర్షాల కారణంగా తెలంగాణలో వేర్వేరు చోట్ల నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ బహదూర్ పురా చౌరస్తాలో విద్యుత్ స్తంభాన్ని ముట్టుకున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలపూర్ వద్ద కోళ్లఫారంలో గోడ కూలి ఇద్దరు మేస్త్రీలు చనిపోయారు. వరంగల్ జిల్లాలో వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై వెళ్తుండగా.... చెట్టు కూలి ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు.


దంచేసింది

భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు... వేడిని తగ్గిస్తే... రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వడగళ్లు, ఈదరుగాలులతో కూడిన వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వ్యవసాయ మార్కెట్ లోని 300 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసింది. తూకం కోసం ఎదురుచూస్తుండగా ధాన్యం రాశులు తడిసి రైతులు బోరుమంటున్నారు. రామడుగు, గంగాధర, కొడిమ్యాల, బోయినపల్లి మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద ధాన్యం రాశులు తడిసి రైతులు నష్టపోయారు.సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో... పలుచోట్ల ఈదురు గాలులకు మామిడి నేలరాలింది. ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పంటలు దెబ్బ తిన్నాయి. ములుగు జిల్లా.. వాజేడు, వెంకటాపురం, మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి మండలాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. హైదరాబాద్ , సికింద్రాబాద్ సహా శివార్లలోని చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాతావరణం కాస్త చల్లబడింది. కొన్నిచోట్ల వర్షపునీరు నిలిచి ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగితే మరికొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శేరిలింగంపల్లిలో 10.8 సెంటీమీటర్లు, సికింద్రాబాద్ GHMC ఆఫీసువద్ద 8.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైతే కూకట్ పల్లిలో 7,సిద్దిపేటలో 6.6,మెదక్ జిల్లా మాసాయిపేటలో 6.5 సెంటీమీటర్లు పడింది. చాలా ప్రాంతాల్లో 4 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.

Tags:    

Similar News