SC: వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అదనపు సాక్ష్యాధారాలు, కొత్త సమాచారం ఉంటే వాటిని సీబీఐకి అందజేసే పూర్తి స్వేచ్ఛను వివేకా కుమార్తె సునీతకు కల్పించింది. హత్య జరిగిన రోజు నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను ధర్మాసనం సమర్థించింది. కేవలం ఆ ఇద్దరి మధ్య సంభాషణలకే పరిమితం కాకుండా, విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తే వాటిపై కూడా దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉంటుందని జస్టిస్ సుందరేశ్, జస్టిస్ ఎన్.కె.సింగ్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. "మీరు దర్యాప్తు కొనసాగించండి, ఎవరినైనా విచారించే స్వేచ్ఛ మీకుంది" అని సీబీఐకి సూచించింది. తదుపరి దర్యాప్తు పురోగతిని పర్యవేక్షిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ తీర్పుతో కేసులో మరిన్ని కీలక నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ కేసు విచారణ సమయంలో వివేకా కుమార్తె సునీతరెడ్డి తరుపు న్యాయవాది ఓ విన్నపం చేశారు. ఇందులో భాగంగా.. సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా ఈ కేసులో వాదనలు వినిపిస్తారని.. అందువల్ల ఆయన వచ్చేంత వరకూ విచారణను కాసేపు ఆపాలని కోరారు. దీంతో.. ఈ విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మసనం.. విచారణను కాసేపటికి వాయిదా వేసింది ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఈ కేసు విచారణ కోసం మినీ ట్రయల్ నిర్వహించలేమని.. ఒకవేళ అలా చేస్తే మూడేళ్ల నుంచి నాలుగేళ్లు పడుతుందని అన్నారు.