NTR District: ఎడతెరిపి లేకుండా వర్షాలు
ఇళ్లలోకి చేరిన వరద నీరు; వరద నీటిలో ఇళ్లలోకి కొట్టుకొస్తున్న పాములు;
ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాపి మేస్త్రీ కాలనీలోకి భారీగా వరద చేరింది. ఇళ్లన్నీ జలమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా రాత్రి సమయాలలో విద్యుత్ నిలిపివేస్తుండటంతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద కారణంగా ఇళ్లలో పాములు వస్తున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నీటిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ఎదురుబీడెం వద్ద కాకర్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారిపైకి వరద నీరు చేరడంతో.. ఎదురుగూడెం- పోరాట నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరం పోలీసులు వాగు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాగు వైపు వాహనదారులు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ రమేష్ కోరారు.
వర్షాలకు నందిగామలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కొద్దిపాటి వర్షానికే రహదారులు చిత్తడిగా మారుతుండటంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. చాలా రోజులుగా రోడ్లకు మరమ్మతులు చేయకపోవడంతో గోతులమయంగా మారాయి. కంచికచర్లలో వర్షం కురిసిందంటే చాలు వాహనదారులు భయపడిపోతున్నారు. కంచికచర్ల బస్టాండ్ ప్రాంతం, వీరులపాడు వెళ్లే రోడ్డు గుంతలమయం కావడంతో భారీగా నీరు నిలిచిపోతోంది. దీంతో ఆ దారి గుండా వెళ్తున్న వాహనదారులు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి