POLLS: ఓట్ల పండుగకు సొంతూళ్లకు ప్రజలు

కిక్కిరిసిపోతున్న బస్సులు, రైళ్లు,.... ఓర్చుకుంటూ ఓటేసేందుకు స్వస్థలాలకు ప్రజలు;

Update: 2024-05-12 03:00 GMT

రేపు జరిగే ఓట్ల పండగ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైదరాబాద్‌ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు జనం అంతా ఒకేసారి వెళ్తుండడంతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎంత కష్టమైనా ఓర్చుకుంటూ ఓటు వేసేందుకు స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. భాగ్యనగరంలో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు పదిలక్షల మంది ఓటర్లున్నారు. చాలా మంది రవాణా సదుపాయాలు సరిపోక తీవ్ర అవస్థలు పడుతూనే.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేందుకు రాకపోకలు సాగిస్తున్నారు.


ఓటు వేసేందుకు హైదరాబాద్‌లో నివసిస్తున్న తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ వాసులు సొంతూరు బాటపడుతున్నారు. ఉద్యోగులకు శని,ఆదివారాలు సెలవులు. సోమవారం ఎన్నికల్లో పాల్గొనేందుకు ECఆదేశాలతో చాలా సంస్థలు సెలవు ప్రకటించాయి. ఫలితంగా 13న జరిగే పోలింగ్‌ కోసం భారీగా సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. RTC, దక్షిణమధ్య రైల్వే అదనపు సేవలు సమకూర్చినా రద్దీకి తగినట్లుగా సరిపోవడం లేదు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్‌ సంస్థల నిర్వాహకులు ఛార్జీలు భారీగా పెంచేశారు. మామూలు రోజుల కన్నా రెట్టింపు పిండేస్తున్నారని జనం వాపోతున్నారు.


హైదరాబాద్‌లోని MGBS, JBS , కూకట్‌పల్లి, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, LB నగర్‌, మియాపూర్‌ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్లుసైతం ఓటు కోసం స్వస్థలాలకు వెళ్లేవారితో కిక్కిరిసిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో JBS సందడిగా మారింది. ఏ బస్సు చూసినా.. సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పంచామని RTC అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యార్థం TSRTC దాదాపు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. MGBS నుంచి నుంచి 500, JBS నుంచి 200, ఉప్పల్ నుంచి 300, LB నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. రెండ్రోజులపాటు 50ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. 22 రైళ్లకు అదనపు బోగీలతో సర్వీసులు పెంచినట్లు తెలిపారు.

సొంతూళ్లకు వెళ్లే ఓటర్లతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారి కార్లు, బస్సులు, ఇతర వెహికల్స్‌తో రద్దీగా మారింది. పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. సాధారణ రోజుల్లో విజయవాడవైపు 8 ఎగ్జిట్‌లు ఉండగా ఓట్ల రద్దీ దృష్ట్యా.. దాన్ని పదికి పెంచారు. మామూలు రోజుల్లో 35 వేల వాహనాలు వెళుతుండగా.. ఎన్నికల వేళ అదనంగా మరో 5 వేలు పెరిగినట్లు GMR అధికారులు తెలిపారు. ఆదివారం వాహనాల రాకపోకలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనావేస్తున్నారు. పోలింగ్‌లో పాల్గొనేందుకు భాగ్యనగరం నుంచి ఓటర్లు భారీగా వెళ్తుండడంతో నగరం బోసిపోయి కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్‌తో కిక్కిరిసే ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు భారీగా తగ్గాయి. వరుసగా మూడ్రోజులు సెలవు రావడం వల్ల కుటుంబంతో సహా స్వస్థలాలకు తరలివెళ్లారు.

Tags:    

Similar News