HPV VACCINE: మహిళకు వరం - హెచ్‌పీవీ వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్న కేంద్రం... ఏపీలో 3.45 లక్షలమంది బాలికలకు వ్యాక్సిన్.. తెలంగాణలోనూ ఆరంభమైన వ్యాక్సిన డ్రైవ్...
దేశంలో మహిళల ఆరోగ్య రక్షణకు ఒక కీలక ముందడుగు పడబోతోంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) వంటి ప్రాణాంతక వ్యాధిని ముందుగానే అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 28న కేంద్ర ఆరోగ్య శాఖ ప్రారంభించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు చేపడుతున్న ఈ టీకా కార్యక్రమం భారతదేశంలో క్యాన్సర్ నియంత్రణ వ్యూహంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
ఏపీలో విస్తృత ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 3.45 లక్షలమంది 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేసింది. గ్రామ/వార్డు సచివాలయాల శాఖ సమీకరించిన సమాచారం ప్రకారం కర్నూలు జిల్లాలో అత్యధికంగా 23,957 మంది బాలికలు ఉండగా, పోలవరం జిల్లాలో అత్యల్పంగా 2,777 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకోసం వైద్య సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రతి బాలికకు 0.5 ఎంఎల్ మోతాదులో ఇంజక్షన్ రూపంలో టీకా ఇస్తారు. సుమారు మూడు నెలల పాటు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. తొలి విడతగా కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ వయల్స్ రాష్ట్రానికి చేరుకున్నాయి. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు తల్లిదండ్రుల్లో కనీసం ఒకరి లిఖితపూర్వక సమ్మతి తప్పనిసరి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య పీహెచ్‌సీల్లో టీకా అందించనున్నారు. వ్యాక్సిన్ పంపిణీ వివరాలను ‘యూవిన్’ డిజిటల్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. పైలెట్ ప్రాజెక్టుగా ఏపీ పలు జిల్లాల్లో స్క్రీనింగ్ కూడా చేశారు. 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టేందుకు విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రితో ఎంవోయూ కుదుర్చుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే గ్రామాల్లో వైద్యసేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వైద్యులకు శిక్షణనిచ్చారు. సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించడానికి సర్వం సన్నద్ధం చేసిన సమయంలోనే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో స్క్రీనింగ్ వాయిదా పడింది. ఎన్నికల తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (సీడీ–ఎన్సీడీ–3.0) సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటూ హడావుడి చేసింది.
హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎందుకు కీలకం?
హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) అనేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణం. సుమారు 85-90 శాతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు హెచ్‌పీవీ కారణంగానే వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హెచ్‌పీవీ టైప్ 16, 18 అత్యంత ప్రమాదకరమైనవి. టైప్ 6, 11 కూడా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. ‘గార్డాసిల్-4’ అనే వ్యాక్సిన్ ఈ నాలుగు రకాల వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గార్డాసిల్-4 టీకా 15 ఏళ్ల లోపు బాలికలకు రెండు డోసుల్లో ఇవ్వాలి. ఒక్కో డోసు ధర సుమారు రూ.3,927. 15 ఏళ్లు పైబడిన వారు మూడు డోసులు తీసుకోవాలి. బయట ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేయించుకుంటే ఒక్కో మోతాదుకు రూ.6,000 నుంచి రూ.12,000 వరకు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉచిత టీకా కార్యక్రమం పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుంది. ఈ వ్యాక్సిన్ 2006లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 160 దేశాల్లో ఈ కార్యక్రమం అమలులో ఉండగా, వాటిలో 90 దేశాలు సింగిల్ డోసు విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన లక్ష్యంతో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను కీలక వ్యూహంగా సూచించింది.
దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ భారం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చైనా, అమెరికా తర్వాత క్యాన్సర్ బాధితుల సంఖ్యలో భారత్ మూడో స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో ఏటా 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. తెలంగాణ ప్రభుత్వం కూడా గర్భాశయ క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 1,200 నుంచి 1,500 మంది ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చింది. 4.6 లక్షల డోసుల వ్యాక్సిన్ కొనుగోలు చేసి, 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా అందించనుంది.