BOTSA: బొత్స త్వరగా కోలుకోవాలి: నారా లోకేశ్
సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలన్న పవన్
వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం అస్వస్థతకు గురై చికిత్స చేయించుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. తన సహచర ఎమ్మెల్సీ బొత్స త్వరగా ప్రజాసేవలోకి రావాలని ప్రార్థిస్తున్నట్లు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న బొత్స ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
"శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను. ఆయన త్వరగా ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను," అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులైనప్పటికీ, బొత్స ఆరోగ్యం పట్ల పవన్ కల్యాణ్ చూపిన మానవత్వం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.