Andhra Pradesh : ఐపీఎంలో 150 పోస్టులను వెంటనే భర్తీ చేయండి - సీఎం చంద్రబాబు
ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అన్నారు. వైద్య వ్యవస్థ బలోపేతంపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అవసరమైతే ఔట్ సోర్సింగ్ సేవలు తీసుకోవాలని, మెడికల్ కాలేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలని చెప్పారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టరేట్‌లో పోస్టులను భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రిని కోరారు. 723 పోస్టులకు గానూ కేవలం 143 మంది మాత్రమే ఉన్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. 150 పోస్టులను భర్తీ చేసేలా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. అలాగే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు సమస్యను పరిష్కరించాలని సత్యకుమార్‌కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.