అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ పంచాయతీ ఎస్పీ కార్యాలయానికి చేరింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి వర్గానికి చెందిన వారమని శివరామరెడ్డి అనుచరుల నుంచి ప్రాణహానీ ఉందంటూ.. సర్పంచ్ మోనాలిసా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
వజ్రకరూర్ మండలంలో గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ 10 మందిని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురిని గుంతకల్ కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధిపత్య పోరు,పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.