మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగినప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కేసు పెట్టారు. విచారణ జరుగుతుండగా ఇటీవల కేసు విత్ డ్రా చేసుకొని తనను బెదిరిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంశీ కిడ్నాప్ చేసి బెదిరించడం వల్లే సత్యవర్ధన్ విత్ డ్రా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో తెదేపా నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఏ2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్‌లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నారు.