Jagananna Thodu: .వైకాపా కార్యకర్తలకే ‘జగనన్న తోడు ’

చిరు వ్యాపారులకు దక్కని పథకాలు;

Update: 2024-04-27 02:15 GMT

సంక్షేమ పథకాల సృష్టికర్త తానే అన్నట్లుగా బిల్డప్‌ ఇచ్చే ముఖ్యమంత్రి జగన్ ...అర్హులైన అందరికీ పథకాలు అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేళ్లుగా ప్రజలను నమ్మించారు. కానీ ఆయన పాలనలో పథకాల అమలు చూస్తే ...వైకాపా కార్యకర్తలకే పెద్దపీట అనేది సుష్పష్టం. ఇందుకు చిరు వ్యాపారులు సైతం మినహాయింపు కాదు. వారికి ‘జగనన్న తోడు ’ పేరుతో 10 వేల చొప్పున అందించే వడ్డీలేని రుణాల పథకమే ఇందుకు నిదర్శనం.

జగనన్న తోడు పథకంలో ఒక్కో చిరు వ్యాపారికి 10 వేల చొప్పున ఇచ్చే వడ్డీ లేని రుణాల లబ్ధిదారుల్లో సింహభాగం వైకాపా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారే..... పుర, నగరపాలక సంస్థల సిబ్బంది దరఖాస్తుదారుల జాబితాను ఏటా ఎమ్మెల్యేలకు ఇవ్వడం, వారు సిఫార్సు చేసిన లబ్ధిదారుల పేర్లు బ్యాంకులకు పంపడం... రివాజుగా మారింది. పథకం మొదలయ్యాక 2020-21 నుంచి 2023-24 వరకు ఇదే తంతు. మొదటిసారి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5లక్షల 35వేలు, చివరిసారి 2023-24లో 12 లక్షల మందితో కలిపి నాలుగేళ్లలో 36 లక్షల మంది చిరు వ్యాపారులకు 10 వేల చొప్పున రుణాలిచ్చినట్లుగా ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. అసలు విషయానికొస్తే ... విజయవాడ, విశాఖ, గుంటూరు, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు నగరపాలక సంస్థల్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో సగం మంది వైకాపా కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులే. అర్హులైన నిరుపేద లబ్ధిదారుల దరఖాస్తులను పక్కన పెట్టి....కార్యకర్తల జేబులు నింపారు.

ఒకసారి తీసుకున్న 10 వేల రుణం వాయిదాల కింద బ్యాంకులకు సకాలంలో తిరిగి చెల్లిస్తే రెండోసారి 11 వేలు, మూడోసారి 12 వేలు, నాలుగోసారి 13 వేల చొప్పున పెంచుతూ బ్యాంకులు రుణాలిచ్చేలా సీఎం జగన్‌ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. రోడ్లపై వ్యాపారం చేసే అర్హులు సకాలంలో బ్యాంకు రుణం చెల్లిస్తున్నారు. నేతల సిఫార్సులపై వైకాపా కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరులకు ఇచ్చిన రుణాల్లో రికవరీ నామమాత్రమే. ఇలాంటి వారెవరూ వ్యాపారం చేయడం లేదు. బ్యాంకులిచ్చిన 10 వేల రుణాన్ని మాత్రం స్వాహా చేశారు.లబ్ధిదారులుగా వైకాపా కార్యకర్తలు చూపించిన చిరునామాల్లో తోపుడుబళ్లు, బడ్డీలు, టిఫిన్‌ కొట్లే కనిపించడం లేదు. ఇచ్చిన రుణాలు రికవరీ చేయడం బ్యాంకర్లకు సవాల్‌గా మారింది. పథకం ప్రారంభించాక ఇప్పటివరకు మొత్తం 3 వేల 668 కోట్ల రుణాలు బ్యాంకులిచ్చాయని అంచనా. ‘తప్పుడు పత్రాలు చూపించి రుణం తీసుకున్నారు. రికవరీ చేద్దామంటే వారెవరూ బ్యాంకుకి ఇచ్చిన చిరునామాలో లేరు. రాయలసీమ జిల్లాల్లో వివిధ బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో అత్యధికంగా వైకాపా కార్యకర్తలే ఉన్నట్లు ఒక పరిశీలనలో వెల్లడైంది.  

Tags:    

Similar News