ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొనే చేయాలా? : జనసేనాని

అమరావతి ఉద్యమకారులపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. బంగారం పెట్టుకొని ఉద్యమం చేయకూడదా? అని ప్రశ్నించారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొనే ఉండాలా?..

Update: 2020-11-18 12:03 GMT

అమరావతి ఉద్యమకారులపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. బంగారం పెట్టుకొని ఉద్యమం చేయకూడదా? అని ప్రశ్నించారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొనే ఉండాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు మంగళగిరిలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌.. అమరావతి పరిరక్షణ సమితి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై జనసేన విధానాన్ని స్పష్టంగా చెప్పారు పవన్‌ కల్యాణ్‌. ఉద్యమానికి, సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదన్నారు. రాజధానిని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. అధికారికంగా ప్రకటించాక తమ పార్టీ కార్యాచరణ చెబుతామన్నారు పవన్‌ కల్యాణ్‌...

గతంలో చిన్న రాష్ట్రాలకు అనుకూలమని స్టాండ్‌ తీసుకున్న బీజేపీ.. రాష్ట్ర విభజనను తప్పుబట్టలేదని గుర్తు చేశారు పవన్‌ కల్యాణ్‌. బీజేపీ ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉంటుందన్నారు. రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ తమకు చెప్పిందని... జనసేన పార్టీ స్టాండ్‌ కూడా ఇదేనని స్పష్టం చేశారు. పార్టీ తరుపున అమరావతి ఉద్యమకారులకు తమ అండ ఉంటుందన్నారు. అయితే.. 365వ రోజు లోపు అయిపోయాలన్న డెడ్‌లైన్‌ విధించుకోకూడదన్నారు. ప్రభుత్వం మారింది కాబట్టే.... రాజధానిని మారుస్తామంటే కుదరదన్నారు. రాజధాని కేవలం ఒక కులానికి చెందిందన్న మాట విపక్షనేతగా ఉన్నప్పుడు జగన్‌ చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఆ రోజు ఒప్పుకుని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మనసు మార్చుకోవడం కుదరదన్నారు.

అమరావతి ఉద్యమం గురించి అన్ని అంశాలను పవన్ కళ్యాణ్ కు వివరించామన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు. పవన్‌ సానుకూలంగా స్పందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. బీజేపి తో కలిసి అమరావతి ఉద్యమంలోకి అవసరమైన సమయంలో వస్తామని హామీ ఇచ్చారన్నారు. వీలైతే ప్రధాని మోదీ, అమిత్ షా లతో అపాయింట్ మెంట్ కు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గతంలో ఢిల్లీ లో అమరావతి కి మద్దతుగా లాంగ్ మార్చ్ చేయాలని భావించామని చెప్పారని, అమరావతి పోరాటానికి జనసేన అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారన్నారు.

అమరావతి ఉద్యమం పై పవన్ స్పందించిన తీరు బాగుందన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ ముడిపడి ఉందన్నారు. మహిళలు ఆత్మాభిమానాన్ని చంపుకుని ఏడాది కాలంగా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారన్నారు. అన్ని పార్టీ లు మద్దతు ఇస్తున్నా.. పోరాటంలో భాగస్వామ్యం కావడం లేదన్నారు. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టి కి తీసుకెళ్లినట్లు తెలిపారు. అవసరమైన సమయంలో తప్పకుండా స్పందిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మొత్తానికి అమరావతి జేఏసీనేతలతో.. పవన్‌ కల్యాణ్‌ సుధీర్ఘ చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని అమరావతి జేఏసీ నేతలకు భరోసా ఇచ్చారు.అటు.. జేఏసీ నేతలు సైతం.. అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళతామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News