PAWAN: జనసేన శ్రేణులకు పవన్ కీలక సందేశం

అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి.. కూటమి అంతర్గత విషయాలపై ప్రతిస్పందించొద్దని సూచన;

Update: 2025-01-27 03:00 GMT

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు కీలక సందేశం అందించారు. ప్రియమైన జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం... అంటూ బహిరంగ లేఖ రాశారు. జనసేన నేతలు, వీర మహిళలు, జన సైనికులు.. ఎవరూ అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని పవన్‌కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై.. కూటమి అంతర్గత విషయాలపై ఎవరూ ప్రతిస్పందించొద్దని... జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. పార్టీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఈ బహిరంగ లేఖను పోస్ట్‌ చేశారు.

ఆ విజయం చారిత్రాత్మకం

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమి సాధించిన అద్వితీయ ఘనవిజయం చారిత్రాత్మకమని పవన్ గుర్తు చేశారు. ఐదేళ్లుగా వైసీపీ సాగించిన నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతిభద్రత వైఫల్యాలపై ప్రజలు విసుగుచెందారని పవన్ పేర్కొన్నారు. ప్రజలు అందించిన ఈ విజయాన్ని బాధ్యతగా భావిస్తున్నామని పవన్ తెలిపారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో... కేంద్రం సహాయసహకారాలతో చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మారుమూల గ్రామాల్లో సైతం రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు.

నాకు కన్నీరు తుడవడమే తెలుసు

తాను ఏ రోజూ పదవుల కోసం రాజకీయం చేయలేదని.. భవిష్యత్తులోనూ చేయబోనని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవడం, వారికి అండగా నిలబడడం, పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే తనకు తెలుసని స్పష్టం చేశారు. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున భవిష్యత్తు లక్ష్యాలపై చర్చించి.. మరింత సమగ్రంగా ముందుకు సాగుతామని పవన్ తెలిపారు.

Tags:    

Similar News