PAWAN: పవన్‌కు లేఖ.. సారీ చెప్పిన ఎమ్మెల్యే
వైద్యులకు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే... డాక్టర్ల లేఖ నేపథ్యంలో నిర్ణయం;
రంగరాయ మెడికల్ కాలేజీలో దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన దాడిపై వైద్య విద్యార్థులు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ రాసింది. నానాజీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎమ్మెల్యేను ఏ1గా చేర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు తారా స్థాయికి చేరడంతో ఎమ్యెల్యే క్షమాపణ చెప్పారు.
అసలు ఏం జరిగందంటే..?
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక మెడికల్ కాలేజీ వైస్ చైర్మన్ పై దౌర్జన్యం చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న పంతం నానాజీ తన అనుచరులతో కలిసి సిటీలోని రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద చేసిన దౌర్జన్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ భగ్గుమంది. వెంటనే జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డాక్టర్ పై దాడి చేసిన పంతం నానాజీపై చర్యలు తీసుకోకుంటే వెంటనే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తూ లేఖ రాశారు. అక్కడ చదువుకున్న వారు డాక్టర్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన స్థానాల్లో ఉన్నారు. అంత చరిత్ర ఉన్న రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో బాస్కెట్ బాల్ ఆడుకుంటామంటూ కొందరు అనుచరులు ఎమ్మెల్యే పంతం నానాజీని అడిగారు. వారికోసం నానాజీ మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని అనుమతి కోరారు. అది ఇంకా పెండింగ్ లో ఉంది. ఈలోపులోనే ఆయన అనుచరులు కొందరు కాలేజీ గ్రౌండ్లో నెట్ కట్టడానికి ప్రయత్నించారు. దీనిని అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు.
ఆందోళన చేస్తాం
ఒక ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ పైనే ఇలా ఒక ఎమ్మెల్యే అండ్ కో దాడికి దిగడంతో ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (APGDA )ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే అనుచరుల పేరుతో కొందరు కాలేజీ బాస్కెట్బాల్ గ్రౌండ్ ను ఆక్రమించి అక్కడ చట్ట వ్యతిరేకమైన పనులు, బెట్టింగులు, మహిళా స్టూడెంట్ లు ఉన్న కాలేజ్ ప్రాంతంలో న్యూసెన్స్ కు పాల్పడుతున్నారని అవి వద్దు అని చెప్పినందుకు ఇలా ఎమ్మెల్యేను తీసుకొచ్చి దౌర్జన్యానికి దిగారని లేఖ ను రిలీజ్ చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తమ ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే ఎమ్మెల్యే అనుచరులమంటూ దాడి చేసిన పై వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తగిన చర్యలు తీసుకోవాలని లేకుంటే 10000 మంది వరకూ ఉన్న ప్రభుత్వ డాక్టర్లందరూ నిరసనకు దిగుతాము అంటూ ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై కళ్యాణ్ ఎలా స్పందిస్తారో అన్నది రాజకీయంగా చర్చనీయాంశమైంది.