ఏపీలో ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో కీలక మార్పులు

ఏపీలో వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది..

Update: 2020-09-02 01:14 GMT

ఏపీలో వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాలకు ప్రభుత్వం చెల్లించనున్నది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కంలకు చెల్లించేలా కార్యాచరణ రూపొందించింది. దీనికి సంబంధించిన జీవోను విడుదల చేసింది.

నవరత్నాల్లో భాగంగా ఉచిత విద్యుత్తుకు రూ.8400 కోట్లు ఖర్చవుతోందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం కోసం రాష్ట్రంలోని సుమారు 18 లక్షల రైతులకు ఏటా 12వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు వివరించింది. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులపై భారం పడకుండా ఉచిత విద్యుత్‌ పథకం అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు వీలుగా రూ.1,700కోట్లతో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం సూచనలకు అనుగుణంగానే ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకం అమలుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసేందుకే నగదు బదిలీ పథకాన్ని తీసుకొస్తున్నారని టీడీపీ విమర్శించింది. 'జగన్ మరిన్ని అప్పులు చేయడానికి రైతులను అప్పులపాలు చేయబోతున్నారని కళా వెంకట్రావు మండిపడ్డారు. విద్యుత్ కష్టాలు తగ్గించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాన్ని రాష్ట్రంలోనే ఎవరి ప్రయోజనం కోసం ప్రవేశపెడుతున్నారు అని కళా వెంకట్రావు నిలదీశారు.

వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. దశలవారీగా 18 లక్షల వ్యవసాయదారులు నోట్లో మట్టి కొట్టేందుకు జీవోలు తెస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం గుడ్డిగా మద్దతు ఇస్తున్నదని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం మీటర్లు బిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాల్సిన అగత్యం ఎందుకు? ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు ఉచిత విద్యుత్ బిల్లులు చెల్లించకూడదా? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ నుంచి దశలవారీగా తప్పుకునేందుకే నగదు బదిలీ కుట్ర జరుగుతోందని, తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News