PAWAN: పవన్‌కు పోలీసుల నోటీసులు

రాళ్ల దాడి వ్యాఖ్యలపై సాక్ష్యాలు ఇవ్వాలంటూ జనసేనానికి నోటీసులు...;

Update: 2023-10-04 08:00 GMT

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు జరగనున్న పెడన వారాహి యాత్రలో రాళ్లదాడికి ప్లాన్ చేశారని నిన్న పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సాక్ష్యాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీ పి. జాషువా నోటీలుసు జారీ చేశారు. పెడన వారాహియాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఆధారాలు లేకుండా పవన్ ఆరోపణలు చేయటం సరికాదని ఎస్పీ జాషువా అన్నారు.

మంగళవారం మచిలీపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెడనలో జరిగే సభలో రాళ్లు, కత్తులతో దాడి చేసే అవకాశం ఉందని, 2 వేల మంది గూండాలను, క్రిమినల్స్‌ను పబ్లిక్ మీటింగ్‌లోకి దింపి అల్లర్లు సృష్టించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. కత్తులు, కటార్లు తెచ్చేవారిని జనసైనికులు గమనించి పోలీసులకు అప్పగించాలని సూచించారు. సీఎం జగన్, డీజీపీ, హోంమంత్రి, పోలీసులకు ఒక్కటే చెబుతున్నా.. రేపటి సభలో ఏదైనా అయితే తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని hపవన్‌ హెచ్చరించారు.


ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కృష్ణాజిల్లా పోలీసులు పవన్‌కల్యాణ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆధారాలుంటే ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. జనసేనాని గత మూడు రోజులుగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈనెల 1న అవనిగడ్డలో బహిరంగ సభ నిర్వహించారు. రెండు రోజులు మచిలీపట్నంలో సమావేశాలు, జనవాణి నిర్వహించారు. నేడు(బుధవారం) పెడనలో భారీ బహిరంగ సభ తలపెట్టారు. బంటుమిల్లి రోడ్డులో సభ నిమిత్తం ఏర్పాట్లు చేశారు. ఈ సభలో అల్లర్లు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాల నుంచి పవన్‌కల్యాణ్‌కు సమాచారం అందినట్లు తెలిసింది. అమలాపురం తరహాలో సభ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా పవన్‌ ఆరోపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయలసీమ నుంచి వైసీపీ నేతలు... రౌడీలను, అల్లరిమూకలను దించారనీ.. వారు రాళ్లు రువ్వేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌ ఘాటైన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమైంది. 

Tags:    

Similar News