KTR: కాంగ్రెస్‌కు అసలు సినిమా ముందుంది
ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారన్న కేటీఆర్.... లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం;
కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా ముందుందని బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో వరంగల్ లోక్‌సభ సన్నాహాక సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌పై ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ను ఊదేస్తామని కొందరు చెబుతున్నారని మండిపడిన KTR... ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నంత వరకు పార్టీకి ఢోకా లేదని స్పష్టం చేశారు. ఓరుగల్లు పార్లమెంటరీ స్థానంలో మళ్లీ పాగా వేసేలా బీఆర్‌ఎస్ వ్యూహాలు సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. విధ్వంసమైన తెలంగాణను పదేళ్లలో కేసీఆర్ వికాసం వైపు మళ్లించారని, గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడినంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని కేటీఆర్ వివరించారు.
తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలన్న తపనతో పరిపాలనపై పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత సమయాన్ని తక్కువ కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వరంగల్ లోక్‌సభ సన్నాహాక సమావేశంలో కాంగ్రెస్ సర్కారు తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. 23 ఏళ్లుగా బీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని తపించిన చాలామంది విఫలమయ్యారని కేటీఆర్ అన్నారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నంత వరకు భారాసను లేకుండా చేయడం ఎవరి వల్ల కాదని తేల్చిచెప్పారు. పార్టీని ఏక తాటిపై తెచ్చేందుకు త్వరలోనే శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్న ఆయన... తెలంగాణ భవన్‌లో తను, సీనియర్లు సదా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.
ఉద్యమాల వీరగడ్డ వరంగల్ జిల్లా పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కేటీఆర్ ఓరుగల్లు జిల్లా నేతలకు సూచించారు. సన్నాహక సమావేశాల్లో పార్టీ బలోపేతానికి ఎన్నో సూచనలు వస్తున్నాయన్న ఆయన..పార్టీ పరంగా లోపాలు సమీక్షించుకుంటామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి, పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిపెట్టి విజయం దిశగా పనిచేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. హామీల నుంచి తప్పించుకునేందుకు ఆకారణంగా నిందలు వేస్తే ఊరుకోబోమన్న ఆయన..కాంగ్రెస్ నిజస్వరూపాన్ని వాళ్ళ 420 హామీలతోనే ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పథకాల రద్దుపై కాంగ్రెస్ వైఖరిని కడియం శ్రీహరి తప్పుపట్టారు. ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్న వారిని పట్టించుకోలేదని కొందరు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి గుర్తింపు ఇవ్వలేదని సమావేశంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి అసలు సినిమా ముందుందని కేటీఆర్ అన్నారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్ ప్రభంజనం ఖాయమన్న కేటీఆర్.... ఇప్పటికే ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేనందుకు ప్రజలు బాధ పడుతున్నారని అన్నారు.విధ్వంసమైన తెలంగాణను పదేళ్లలో కేసీఆర్ వికాసం వైపు మళ్లించారని, గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడినంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని కేటీఆర్ వివరించారు.