Tirupathi: చిక్కిన చిరుత... తిరుపతి జూకు తరలింపు

Update: 2023-08-14 07:09 GMT


తిరుమల నడకదారిలో బాలికపై దాడి చేసి చంపేసిన ఆడ చిరుత చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున ఆడ చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు చిరుతను తిరుపతి జూకు తరలించారు.

తిరుమల నడక మార్గాల్లో భక్తులు క్రూర మృగాల నుంచి రక్షించే విధంగా ప్రతిపాదనలు ఇవ్వమని అటవీశాఖను కోరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. చిరుత చిక్కిన ప్రాంతానికి వెళ్లి ఆయన పరిశీలించారు. అటవీశాఖకు అవసరమైన మ్యాన్ పవర్, ఇన్ఫాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి టీటీడీ అందిస్తుందని తెలిపారు. ఇది టీటీడీ చేసే పనికాదు.. నడక మార్గాలు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాయని చెప్పారు. భక్తులు ప్రశాంతంగా తిరుమలకు నడిచివెళ్లేలలా అన్ని చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో తెలిపారు.

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకున్న తర్వాత నడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుమల దర్శనానికి వచ్చి చిరుత దాడిలో గాయపడి మరణించటం తిరుమల చరిత్రలో ఇదే తొలిసారి.

Tags:    

Similar News