LIQUOR CASE: త్వరలో అతిపెద్ద తిమింగలం: కొల్లు రవీంద్ర
లిక్కర్ కేసుపై సంచలన వ్యాఖ్యలు;
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణంలో త్వరలో అతి పెద్ద తిమింగలం బయటకొస్తుందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద మద్యం కుంభకోణమన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయి.. అన్ని ఆధారాలతో త్వరలో పెద్ద తిమింగళం బయట పడుతుందన్నారు. గతంలో అడ్డంగా దోచుకుని జేబులు నింపుకొన్నారని ఆరోపించారు. కూటమి వచ్చాక 500 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి కళ్లెం వేశామని తెలిపారు. రాష్ట్రంలో తక్కువ దొరకే నాణ్యమైన మద్యం అందుతుందన్నారు. రాష్ట్రంలో మద్యంతో పాటు ఇంకా అనేక కుంభకోణాలు బయటికి వస్తున్నాయని చెప్పారు.
మాస్టర్‌మైండ్ జగనే
మాజీ సీఎం జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఏపీలో మద్యం స్కామ్‌పై మాణికం ఠాగూర్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘నాసిరకం మద్యంతో రూ.3,200 కోట్లు కొల్లగొట్టారు. లిక్కర్ స్కామ్‌లో మిథున్‌రెడ్డి కేవలం పావు మాత్రమే. అసలు మాస్టర్‌మైండ్ జగన్, భారతి. లిక్కర్ స్కామ్ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసి ఓట్లు కొన్నారు’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని జనసేన ఎంపీ బాలశౌరి అన్నారు. పార్లమెంటు సమావేశాల వేళ.. కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విభజన సమస్యలు, జల జీవన్ మిషన్, బనకచర్ల ప్రాజెక్టు గురించి పార్లమెంటులో చర్చించాలని జనసేన తరఫున ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.