LOKESH: క్యాప్‌ జెమినీ గ్లోబల్‌ సీఈవోతో లోకేశ్‌ భేటీ

విశాఖలో క్యాప్ జెమినీ ఏర్పాటు కీలక చర్చ

Update: 2026-03-12 10:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపడుతున్న ప్రయత్నాల నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ క్యాప్ జెమినీ రతినిధులతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా విశాఖపట్నంలో క్యాప్ జెమినీ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించే అంశంపై చర్చలు జరిగాయి. విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. క్యాప్ జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజతో మంత్రి లోకేశ్ విస్తృతంగా చర్చించారు. విశాఖపట్నంలో సంస్థ ఏర్పాటు కోసం అనుకూలమైన ప్రదేశాలపై ఇప్పటికే ప్రాథమిక పరిశీలనలు కొనసాగుతున్నాయని సమావేశంలో వెల్లడైంది. నగర పరిధిలోని మధురవాడ ఐటీ పార్క్ హిల్–1 ప్రాంతంలో సుమారు 20 ఎకరాల భూమిని సంస్థ ఏర్పాటు కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సంస్థ పూర్తిస్థాయి కార్యాలయం ఏర్పాటుకు ముందుగా తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు భవనాన్ని తాత్కాలిక కార్యాలయంగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ భవనం నుంచి సంస్థ ప్రాథమిక కార్యకలాపాలను ప్రారంభించి, అనంతరం శాశ్వత కార్యాలయ నిర్మాణం పూర్తయ్యాక పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాప్ జెమినీ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థ విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభిస్తే నగరంలో ఐటీ రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, నగరం ఐటీ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారే అవకాశముందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం విశాఖపట్నం భవిష్యత్ అభివృద్ధికి కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News