ఒకే రాష్ట్రమని.. ఒకే రాజధాని అని తాము ఫిక్స్ అయ్యామని, అదే నినాదంతో ఎన్నికలకు వెళ్లామని, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చెప్పామని మంత్రి నారా లోకేశ్ అని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏపీ కేపిటల్‌పై స్పష్టత ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 22 చోట్ల కస్టర్స్ను గుర్తించినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆటోమోటివ్ క్లస్టర్డ్, కర్నూలు జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ, సిమెంట్ క్లస్టర్డ్, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మేనిప్యాక్చర్ క్లస్టర్డ్, నెల్లూరులో గ్లాస్, ఏసీ క్లస్టర్డ్, ప్రకాశం జిల్లాలో కంప్రెస్ బయోగ్లాస్, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఆక్వా క్లస్టర్డ్ను తీసుకొస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదంతో పాలన కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా 11 సీట్లకు మించి గెలవలేకపోయింది. దీంతో అసెంబ్లీ ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు.
ఏపీలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట: మంత్రి లోకేశ్
కంపెనీల అవసరాలకు తగినట్లు చదువుకున్న యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగావకాశాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై శాసనసభలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, యార్లగడ్డ వెంకట్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని.. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 22 క్లస్టర్లు ఏర్పాటుచేశామని వివరించారు. తయారీ, సేవా రంగాలను గుర్తించి.. అందుకు ఉత్పత్తులు, ఉపకరణాలు, విడి భాగాలు ఒకేచోట తయారయ్యేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి లోకేశ్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు సంబంధిత మంత్రులతో ఉప సంఘం ఏర్పాటుచేశామని.. సెక్టార్ల వారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గుర్తించి ఆ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు చేపట్టామన్నారు. సాంకేతికత పెరిగిన సమయంలో బైక్, కార్ మెకానిక్‌లు కూడా కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు.