TG: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
పాలనలో కీలక మార్పులు చేసిన సర్కార్... మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ... కీలక శాఖల నుంచి కలెక్టర్ల దాకా బదిలీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థలో విస్తృత స్థాయిలో మార్పులు చేపట్టింది. రాష్ట్ర పాలనను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సంతకంతో వెలువడిన ఈ ఆదేశాల ప్రకారం మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించబడ్డాయి. రాష్ట్ర సచివాలయంలోని కీలక శాఖల నుంచి జిల్లాల కలెక్టర్ల వరకు ఈ మార్పులు విస్తరించాయి. ఈ బదిలీలలో ముఖ్యంగా ఉన్నతస్థాయి అధికారుల స్థానచలనం గమనార్హం. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్‌ను పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమించారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ రాజ్ శాఖలో ఉన్న ఎన్. శ్రీధర్‌ను ఐటీ & సీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అదనంగా ఆయన మైన్స్ అండ్ జియాలజీ శాఖ బాధ్యతలను కూడా కొనసాగిస్తారు. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మార్చారు. బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సేవలందిస్తున్న గౌరవ్ ఉప్పల్‌ను టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా నియమించారు. జిల్లాల పరిపాలనలో కూడా విస్తృత మార్పులు చోటుచేసుకున్నాయి. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బి. విజయేంద్ర, కరీంనగర్ కలెక్టర్‌గా చిత్ర మిశ్రా, హన్మకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా బాధ్యతలు చేపట్టనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శబర్ష్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా గరిమా అగర్వాల్, వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారీ నియమితులయ్యారు. మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, మేడ్చల్ అదనపు కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా పనిచేసిన బి. విజయేంద్రను తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా నియమించారు. సెర్ప్ సీఈవోగా ఉన్న దివ్య దేవరాజన్ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు.
యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎం. హనుమంతరావును దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా నియమించి, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నారాయణపేట కలెక్టర్ సిక్త పట్నాయక్‌ను ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ సందీప్ కుమార్ ఝాను జనగాం కలెక్టర్‌గా నియమించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌ను సహకార శాఖ స్పెషల్ కమిషనర్, రిజిస్ట్రార్‌గా నియమించారు. ఐటీ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న భవేష్ మిశ్రాను అదే శాఖలో స్పెషల్ సెక్రటరీగా పదోన్నతి ఇచ్చారు. భారీ స్థాయి బదిలీలతో రాష్ట్ర పరిపాలనలో కొత్త ఉత్సాహం, సమన్వయం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కీలక శాఖల్లో అనుభవజ్ఞులైన అధికారులను నియమించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని భావిస్తోంది.