LOKESH: 'స్కూళ్ల దత్తత' – నారా లోకేష్ వినూత్న ఆలోచన
ప్రభుత్వ స్కూళ్ల దత్తత పథకం సిద్ధం!.. మౌలిక సదుపాయాల కోసం లోకేష్ వినూత్న ఆలోచన.. నాడు–నేడు”లో విఫలం… కొత్త ప్లాన్ రెడీ;
ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగాన్ని అభివృద్ధి పరచి ప్రభుత్వ స్కూళ్ల స్థాయిని పెంచాలని విద్యా మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. ఈ దిశగా ఆయన చేపట్టిన తాజా ఆలోచన స్కూళ్ల దత్తత. గత ప్రభుత్వంలో “నాడు–నేడు” పేరుతో వేల కోట్లు ఖర్చు చేసినా, ఫలితంగా కొన్ని కుర్చీలు, గోడలకు రంగులు తప్పితే పెద్దగా మార్పు రాలేదని విమర్శలు వచ్చాయి. విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ లోటును పూడ్చడమే లక్ష్యంగా లోకేష్ కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వారు, అలాగే తమ కెరీర్లో ఎదిగిన ప్రముఖులు ఎక్కువగా ప్రభుత్వ స్కూళ్లలోనే చదివారు. వాళ్లకు తాము చదివిన పాఠశాలల పట్ల ఓ అనుబంధం ఉంటుంది. అయితే, వారు సహాయం చేయాలనుకున్నా సరైన మార్గం తెలియక విరమించేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, ఆసక్తిగల వారు తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలని నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు.
ఆ వెబ్సైట్లో ఆయా స్కూళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రస్తుత పరిస్థితి వివరాలు అందుబాటులో ఉంటాయి. దాతలు లేదా పూర్వవిద్యార్థులు వాటిని చూసి సహాయం చేయవచ్చు. ఇదే కాకుండా, జాతీయస్థాయిలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కూడా విద్యా రంగం అభివృద్ధికి వినియోగించాలన్న ఆలోచనలో లోకేష్ ఉన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు వేగంగా అమలు కావాలని, అందుకు కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన వెనుకాడడం లేదు. ముఖ్యంగా, ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించాలనే నిర్ణయం ఉపాధ్యాయుల నియామకానికి దారితీస్తుంది. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడం మాత్రమే కాకుండా, విద్యార్థులు మెరుగైన వాతావరణంలో చదివే అవకాశం దక్కుతుంది. ఒక వైపు ప్రభుత్వ నిధులు, మరోవైపు ప్రజల సహకారం కలిస్తే, రాష్ట్ర విద్యా రంగం కొత్త దిశలో ప్రయాణిస్తుందని నారా లోకేష్ నమ్ముతున్నారు.