తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి సమావేశంలో పాల్గొని కీలక చర్చలు జరిపారు,. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక ఏపీ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ఇక్కడ సీఎం అయ్యారు. అనంతరం వీరిద్దరూ నేరుగా కలిసి చర్చలు జరుపుకున్న సందర్భాలు లేవు. మర్యాదపూర్వక భేటీలు మాత్రమే జరిగాయి. ఈ మధ్య బనకచర్ల ప్రాజెక్టు వివాదం తర్వాత వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించడం ఆసక్తిని రేపింది. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసేందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు ఇంజనీర్ల బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని జలశక్తిశాఖ కార్యాలయంలో ఇరురాష్ట్రాల సీఎంలతో మంత్రి సీఆర్ పాటిల్ భేటీ అయ్యారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమావేశమై కీలక విషయాలపై చర్చించారు.
ఈ భేటీలో ఇరురాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, నీటిపారుదలశాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు కూడా ఇందులో ఉన్నారు. ఈ సందర్భంగా ఇరువురు ముఖ్యమంత్రులు ఒకరిని ఒకరు సత్కరించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు కాసేపు చర్చించారు. మరోవైపు "బనకచర్ల ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్‌లోని నదుల అనుసంధానానికి, నీటి మళ్లింపుకు సంబంధించిన అంశం మాత్రమే. ఇది గోదావరి జలాలకు కాదు, రెండు రాష్ట్రాల నీటి కేటాయింపులకు కాదుసంబంధించిన అంశం. ఇది ఏపీ అంతర్గత వ్యవహారం తప్ప ఇరు రాష్ట్రాలు చర్చించే అంశం కాదు." అని జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసింది. జలశక్తి నేతృత్వంలో జరిగిన చర్చల్లోనూ ఏకాభిప్రాయం రాలేదు.