META: విశాఖ, ముంబైకి సముద్రగర్భ కేబుల్..!
భారత్‌లోనూ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వాటర్వర్త్... భారత్‌కు అనుసంధానించేలా మెటా చర్యలు.... ల్యాండింగ్ పాయింట్లుగా ముంబై, విశాఖ
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సామర్థ్యం గల సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ 'ప్రాజెక్ట్ వాటర్వర్త్' (Project Waterworth) ద్వారా భారత్‌ను ప్రపంచ డిజిటల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి మెటా (Meta) సంస్థ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కీలకమైన ప్రాజెక్ట్‌కు ల్యాండింగ్ ప్రదేశాలుగా మన దేశంలోని రెండు ప్రధాన నగరాలను - ముంబయి, విశాఖపట్నం - ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు $5 మిలియన్ల ఒప్పందంతో మెటా, సైఫీ టెక్నాలజీస్‌ను (Sify Technologies) తన ల్యాండింగ్ భాగస్వామిగా నియమించుకున్నట్లు సమాచారం. దేశీయంగా ఈ కేబుల్‌ను బ్రాడ్‌బ్యాండ్, డేటా సెంటర్ నెట్‌వర్క్‌లకు అనుసంధానించే బాధ్యతను సైఫీ నిర్వర్తిస్తుంది. కాగా, గూగుల్ కూడా తన $400 మిలియన్ల 'బ్లూ-రామన్' సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్‌కు సైఫీతోనే ఒప్పందం కుదుర్చుకోవడం, ఈ రంగంలో సైఫీ ప్రాధాన్యతను చాటుతోంది. దీనిపై మెటా గానీ, సైఫీ గానీ అధికారికంగా స్పందించలేదు.
ఈ ప్రాజెక్ట్ కోసం మెటా భారతీయ ఐటీ కంపెనీ సైఫీ టెక్నాలజీస్‌ను తన ల్యాండింగ్ పార్ట్నర్గా మెటా ఎంపిక చేసింది. దీని విలువ సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ. 44 కోట్లు). ఈ కేబుల్ ప్రాజెక్ట్‌కి ముంబై, విశాఖపట్నం ల్యాండింగ్ పాయింట్లుగా నిర్ణయించారు. సైఫీ ఇప్పటికే గూగుల్ యొక్క ‘బ్లూ-రామన్’ సబ్‌సీ కేబుల్ ప్రాజెక్ట్‌లో భాగస్వామిగా ఉన్నందున, ఈ కొత్త ఒప్పందం భారతదేశం గ్లోబల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేగంగా ఎదుగుతోందని సూచిస్తోంది. దక్షిణాసియా దేశాల్లో ఇంటర్నెట్ డేటాకు డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో గత మూడేళ్లుగా భారత్‌లో సముద్రగర్భ కేబుల్ రంగంపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ వంటి దేశీయ దిగ్గజ సంస్థలు కేబుల్ సిస్టమ్స్‌పై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు మెటా, గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో నెట్‌వర్క్‌లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. వచ్చే 5-10 ఏళ్లలో మెటా కేబుల్ సిస్టమ్ భారత్‌లో 10 బిలియన్ డాలర్ల వరకు పెట్టబడులు పెట్టే అవకాశం ఉందని కాలిఫోర్నియాకు చెందిన ఓపెన్ కేబుల్స్ సంస్థ వ్యవస్థాపకుడు సునీల్ తగారే అభిప్రాయపడ్డారు.
వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్
ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి ఒక గేమ్-ఛేంజర్ కావచ్చని టెక్ నిపుణులు పేర్కొన్నారు. దీని ద్వారా భారతదేశం.. ప్రపంచ AI మౌలిక సదుపాయాల కేంద్రంగా ఎదగగలదు. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భారతదేశంలో తమ డేటా సెంటర్ క్లస్టర్లుని వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కేబుల్ వల్ల భారతీయ వినియోగదారులకు వేగవంతమైన డేటా ట్రాన్స్ఫర్, తక్కువ లేటెన్సీ,మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. భారతదేశంలో డేటా స్థానికీకరణ (Data Localization) చట్టాలు కఠినతరం అవుతున్న నేపథ్యంలో, మెటా తన డేటా భారతదేశంలోనే నిల్వ చేసే విధానంపై దృష్టి పెడుతోంది. దీని వల్ల దేశీయ సర్వర్ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ సేవలు, AI మోడల్ ట్రైనింగ్ సామర్థ్యాలు మరింత బలపడతాయని అంచనా వేస్తున్నారు. వాటర్వర్త్ కేబుల్ 2029 నాటికి పూర్తి స్థాయిలో వేయబడుతుందని అంచనా వేస్తున్నారు.