విశాఖలో మెట్రోరైల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బొత్స

విశాఖలో మెట్రోరైల్ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. మంత్రి అవంతి శ్రీనివాస్,ఎంపీ సత్యనారాయణతో కలిసి ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టు..

Update: 2020-10-25 10:46 GMT

విశాఖలో మెట్రోరైల్ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. మంత్రి అవంతి శ్రీనివాస్,ఎంపీ సత్యనారాయణతో కలిసి ప్రారంభోత్సవాన్ని చేపట్టారు. విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. మెట్రో రైలు గాజువాక నుంచి కొమ్మాది వరకు మొదట అనుకున్నామని.... ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ను కలుపుతూ భోగారం వరకు మెట్రో రైలును పొడిగించినట్లు మంత్రి బొత్ససత్యనారాయణ వెల్లడించారు. ఈ సందర్బంగా మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సంస్థ ఎం.డి రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు.

నవంబర్ మొదటివారం నాటికల్లా... పూర్తి డిపిఆర్ సిద్దం చేస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి ఆమోదం పొందాక టెండర్లు ఖరారు చేస్తామన్నారు. సబ్ లైన్ కారిడార్ గురుద్వారా నుంచి పాతపోస్టాఫీస్ వరకు వస్తుందన్నారు. మొత్తం 79.91 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు వస్తుందని, కిలోమీటర్‌కు 200 నుంచి 225 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

విశాఖ మెట్రో రైలు నిర్మాణంలో ట్రామ్ కారిడార్ కూడా డిపిఆర్ సిద్దం చేస్తున్నామన్నారు. ప్రైవేటు వ్యక్తుల స్థలాల విషయంలో అడ్డంకులు రాకుండా చూస్తామన్నారు. సిటీలో ఒక కిలోమీటర్ నుంచి 1.75 కి. మీ మధ్య స్టేషన్లు వస్తాయని, నగరం బయట ప్రాంతాల్లో రెండున్నర కి.మీల నుంచి 3 కి. మీ మధ్య స్టేషన్లు వస్తాయని మంత్రి వెల్లడించారు. విశాఖ మెట్రో రైలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తప్పక సహాకరిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ఇప్పటివరకు అడ్డంకులు ఏమి లేవని.... రెండు, మూడు సంస్థలనుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. ఇతర మెట్రో నగరాలకు ధీటుగా విశాఖ అభివృద్ది చేస్తామన్నారు మరో మంత్రి అవంతి శ్రీనివాస్. భోగారం ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్టు, మెట్రో రైలు పూర్తైతే విశాఖ ముఖచిత్రమే మారిపోతుందన్నారు. 

Tags:    

Similar News