MICROSOFT: "మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ జోన్ ఏర్పాటు చేయండి"
మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు నారా లోకేశ్ విజ్ఞప్తి;
జనరేటివ్ ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొని సమన్వయం చేయడానికి ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను కోరారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్‌లో అజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్, మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ను ఉపయోగించి పరిష్కారాలను అన్వేషించేందుకు మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యంలో 2026లో హ్యాకథాన్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న లోకేశ్ బృందం.. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పరిశీలించారు. మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోహ్, సెలా హెడ్ జాస్మిన్ బేగం, సీటీవో మార్క్ సౌజాలతో లోకేశ్ భేటీ అయ్యారు. భారత్‌లో అతిపెద్ద నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణుల సమూహాల్లో ఏపీ ఒకటని చెప్పారు. అమెరికాలో భారతీయ ఐటీ శ్రామికశక్తిలో 25 శాతం కంటే ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారన్నారు. మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులలో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేయడానికి ఏపీ టాలెంట్‌ను ఉపయోగించుకోవాలని కోరారు.
పెట్టుబడుల భాగస్వామ్య కమిటీ: నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ చైర్మన్‌గా `పెట్టుబడుల భాగస్వామ్య` కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ దిగ్గజ సీఈఓ లతోపాటు.. మరింత మంది పెట్టుబడి దారులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
సెమీ కండక్టర్స్ ఫౌండర్‌తో లోకేష్ భేటీ
సింగపూర్‌లో ఐవీపీ సెమీ కండక్టర్స్ ఫౌండర్ రాజా మాణిక్కంతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో సెమీకండక్టర్ పరికరాల తయారీ కేంద్రం లేదా చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు.