AP : టీచర్ ను అభినందించిన మంత్రి లోకేష్... మీరు సూపర్ సార్ అంటూ ప్రశంస...
గురువు అంటే దారి చూపించేవాడు. దీన్ని నిజం చేసి చూపించాడు ఓ ఉపాధ్యాయుడు. పాఠశాలకు వచ్చేందుకు సరైన మార్గం లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో వంతెన నిర్మించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఈ ఉపాధ్యాయుడి కి వచ్చిన ఆలోచనను స్వయంగా విద్యాశాఖ మంత్రి అభినందించారు.
వివరాల ప్రకారం కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు సూరంపేట ప్రాథమిక పాఠశాలకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో విద్యార్థుల హాజరు శాతం తగ్గుతూ వస్తోంది.. సరైన మార్గం లేకపోవడమే విద్యార్థుల హాజరు పడిపోవడానికి కారణమని గుర్తించిన టీచర్ అనిశెట్టి సీతారామరాజు తన సొంత ఖర్చులతో పంట కాలువ మీదుగా కాలిబాట వంతెన నిర్మించారు .పూర్తయ్యే దశలో ఉన్న ఈ బాట సాయంతో విద్యార్థులు సురక్షితంగా పాఠశాలకు వచ్చేందుకు వీలు కలుగుతుంది.
ఇక ఈ విషయం తెలుసుకున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ ఉపాధ్యాయుడిని అభినందించారు. "పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే మార్గదర్శి, పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు మార్గం చూపించారు. సూపర్ సార్ మీరు. అంటూ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.