Nara Lokesh: లోకేశ్ ప్రజాదర్బార్‌కు పోటెత్తుతున్న ప్రజలు

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటున్న నారా లోకేశ్;

Update: 2024-07-30 06:45 GMT

మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’కు ప్రజలు పోటెత్తుతున్నారు. నేడు 20వ రోజు తెల్లవారుజాము నుంచే ప్రజలు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజల సమస్యలను, కష్టాలను ఓపిగ్గా వింటున్న లోకేశ్.. వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్‌లో లోకేశ్ ప్రతి ఒక్కరినీ స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ భరోసా ఇస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 18వ రోజు “ప్రజాదర్బార్”లో ప్రతి ఒక్కరిని కలిసిన మంత్రి, వారి నుంచి విన్నపాలు స్వీకరించారు.

ఆయా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ నందిగం సురేష్​కు చెందిన టిప్పర్ లారీ ఢీకొని నాలుగేళ్ల తన మనవడు దుర్మరణం పాలయ్యాడని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన తాళ్ల నాగరాజు లోకేశ్​ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. పాఠశాల నుంచి తన మనవడిని ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా ఉండవల్లి సెంటర్ వద్ద టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని, ప్రమాదంలో తన కాలు విరిగిందని తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగం సురేష్ పేరు చెప్పి డ్రైవర్ బెదిరించాడని వాపోయారు. విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను విన్న లోకేశ్ పరిశీలించి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News