రాజోలు నియోజకవర్గంలో మరోసారి బయటపడ్డ ఆధిపత్య పోరు
మంత్రి సమక్షంలోనే ఎమ్మెల్యే వర్గీయులు, ప్రత్యర్థివర్గం విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చరచ్చ చేశారు.;
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో MLA రాపాక వరప్రసాద్,YCP ఇన్‌ఛార్జ్ పెదపాటి అమ్మాజీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. మంత్రి సమక్షంలోనే ఎమ్మెల్యే వర్గీయులు, ప్రత్యర్థివర్గం విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చరచ్చ చేశారు. మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇరు వర్గాల మధ్య ఆధిపత్యానికి వేదిక అయింది. ఇరు వర్గ కార్యకర్తల కేకలు, అరుపులతో సభ రసాభాసగా మారింది.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వేదికపై ఉండగానే ఈ రభస జరిగింది. ఒక వర్గం నాయకులను వేదికపైకి రానిచ్చి, మరొక వర్గాన్ని సెక్యూరిటీ అడ్డుకోవడం ఈ గొడవకు కారణమైంది. మంత్రి వేణు ఇరు వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వర్గపోరుకు వేదిక చేయడం తగదన్నారు. ఇరువర్గాలు గొడవ ఆపకపోవంతో మంత్రి, కలెక్టర్ వేదిక దిగివచ్చి క్రిందే సభ నిర్వహించారు.