ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఖరారవడంతో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభానికి మోదీ మే 2న రానున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం వెనక దాదాపు 350 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. సుమారు 5 లక్షల మంది జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో...అందుకు అనుగుణంగా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు.
మే 2వ తేదీ సాయంత్రం 4గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ రాజధాని పనులు పునఃప్రారంభిస్తారు. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ కే. విజయానంద్ ను చంద్రబాబు ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా తొమ్మిది రహదారులను గుర్తించామని, ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వారు ఆదేశించారు.
ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖుల కోసం నాలుగు హెలిప్యాడ్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు. సచివాలయం ఎదుట ముఖ్యమంత్రి ఉపయోగించే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేయాలని నిర్ణయించారు. ఈ నాలుగో హెలీప్యాడ్ ను రైతుల లే ఔట్ లో రెడీ చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది.