NAGABABU: బాధ్యత గల నాయకత్వానికి నారా లోకేశ్ నిదర్శనం
జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరుపై జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రశంసలు కురిపించారు. టీడీపీ నుంచి ఒక అత్యంత బాధ్యతగల నాయకుడు ఎదుగుతున్నారని, లోకేశ్ స్పందిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని ఆయన కొనియాడారు. మైలవరంలోని తారకరామ నగర్ పాఠశాలలో 'దొక్కా సీతమ్మ' మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపం తలెత్తడంపై మంత్రి లోకేశ్ స్పందించిన విధానాన్ని నాగబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాఠశాల స్థాయిలో జరిగిన పొరపాటుకు విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ, విద్యార్థులకు, తల్లిదండ్రులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ఆయన సంస్కారానికి, నాయకత్వ లక్షణానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘటనపై మంత్రి లోకేశ్ ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నారు. ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి, బాధ్యుడైన హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా ఫుడ్ ఏజెన్సీని మార్చారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ‘లీప్’ యాప్ ద్వారా తక్షణ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన సంరక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు.
లోకేష్ చేసిన ట్వీట్‌ను నాగబాబు రీట్వీట్ చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. మధ్యాహ్న భోజనంలో జరిగిన పొరపాటు పాఠశాల స్థాయిలో జరిగినప్పటికీ, బాధ్యతాయుతంగా వ్యవహరించి మంత్రి క్షమాపణలు చెప్పడం నిజమైన నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు. టీడీపీ నుంచి బాధ్యత గల నాయకుడు ఎదుగుతున్నాడని నాగబాబు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లలో చర్చకు దారి తీస్తోంది.